సిటీబ్యూరో, మార్చి 11(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: మహిళలు శక్తి స్వరూపులు. కొంగొత్త ఆలోచన లు, వినూత్న పోకడలతో పలు రం గాలలో ముందడుగులు వేస్తూ రేప టి భవితకు మార్గదర్శకులుగా నిలుస్తారు. మహిళలు ఉన్నత లక్ష్యాలను చేరువయ్యేందుకు వారి ఆలోచనల కు కార్యరూపం దాల్చుతూ తమదైన శైలిలో వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ముందుకు సాగుతున్నారు. సమాజంలో పురుషులతో సమానం గా ఓ వైపు ఉద్యోగం, మరో వైపు వ్యాపార రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ వారందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చింది బిజినెస్ ఉమెన్ ఎక్స్ పో 2022. ‘హైటెక్స్ హైదరాబాద్, కోవె’ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన మహిళ వ్యాపారవేత్తలకు హైటెక్స్ వేదికైంది. ఇందులో భాగంగా మహిళలు వారి ఆలోచనలకు పదును పెడుతూ వారు చేస్తు న్న వ్యాపారంలో భాగంగా సంబంధిత ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో ప్రధానంగా సరికొత్త సాంకేతికతతో తయారు చేయబడినటువంటి గ్యాస్ రెగ్యులేటర్ సిస్టమ్, ప్రత్యేక ఎయిర్ ఫిల్టర్‌తో కూడిన మాస్క్‌లు, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప లు రకాల సహజ ఉత్పత్తులతో కూడిన కిచెన్ సామ గ్రి, వస్ర్తాలు, ఆభరణాలు, చేనేత ఉత్పత్తులు, కొబ్యరి నీళ్ళతో తయారైన సహజ సిద్ధమైన పానీయాలు ప్రదర్శనలో కొలువుదీరాయి.
చల్లటి ప్రదేశాల్లో సైతం వెచ్చగా..
అతి చల్లటి ప్రదేశంలో సైతం మనల్ని వెచ్చగా ఉంచేందుకు పరిశోధన టెక్నాలజీస్ వారు ‘స్టే వార్మ్’ పేరిట ‘ఎయిర్ ఆక్టివేటెడ్ హీటింగ్ సిస్టమ్’తో ఏర్పాటు చేసిన ప్యాకెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సైనికులు చల్లటి ప్రదేశంలో రాత్రనక, పగలనక గడపాల్సి వస్తుంది. దీనిని సైనికుల కొరకు ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. దీనిని కేవలం చేతితో పట్టుకుంటే రెండు సెకండ్లలో మనలో వేడిని పుట్టిస్తుంది. స్టే వార్మ్ 40 నుంచి 45 డిగ్రీల వరకు వేడిని అం దిస్తుంది. ఇది అతి చల్లటి ప్రదేశంలో 8 గంటల వరకు పనిచేస్తుంది. ఇందులో వేడిని పుట్టించేందుకు ఎయిర్ ఆక్టివేటెడ్ హీటింగ్ టెక్నాలజీతో ఐరన్, మట్టి రూపంలో ఉండే విధంగా ఈ ప్యాకెట్‌ను తయారు చేశారు. దీన్ని జేబులో, షూస్‌లో, చేతిలో, గ్లౌజ్‌లో కాని ఒక ప్యాకెట్‌ను పెట్టుకున్నట్లయితే సెంకడ్ల వ్యవధిలోనే మన కు వేడిని అందిస్తుంది. న్యూ ఢిల్లీకి చెందిన సీడీఎస్సీఓ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) చే 2020లో ఆమోదించినట్లు పరిశోధన టెక్నాలజీస్ నిర్వాహకుడు డాక్టర్ సత్యనారాయణ తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా.. ఆటోమేషన్..!
‘మీ ఇల్లాలు మీ మాట వినకపోవచ్చు.. కానీ, మా డివైజెస్ మాత్రం మీ మాట తప్పకుండా వింటాయి.’ ఇదే ట్యాగ్‌లైన్‌తో యువకుడు విశాల్ మూడేండ్ల కిందట ‘అప్ హోమ్’ పేరుతో స్టార్టప్ ప్రారంభించాడు. లైట్స్ వెలగడం, ఆర్పడం, కర్టన్స్ను పైకి లేపడం.., దించడం.. డోర్ బెల్, డోర్ లాక్, మోషన్ సెన్సార్, బ్రైట్నెస్ కంట్రోల్, కలర్ ఛేంజింగ్ లైట్స్, వాష్ రూం మేనేజ్మెంట్, అప్ అండ్ వాయిస్ కంట్రోల్ లైట్స్, ఇంటరాక్షన్ అలర్ట్, స్మార్ట్ కెమెరాలు, తదితర స్మార్ట్ సర్వీస్ అంతా ఒకే వేదిక వద్ద లభించనుంది. ఇప్పటి వరకు 2200 ఇండ్లకు ఆటోమేషన్ ఇన్స్టాల్ చేశానని అతడు తెలిపాడు. బిజినెస్ ఎక్స్‌పోతో తమ వ్యాపారం మరింతగా కస్టమర్లకు దగ్గరగా అవుతుందని భావిస్తున్నట్టు చెప్పాడు.
నెల తక్కువ పిల్లలకు నియో వార్మ్ రక్షణ…
కొంత మంది చిన్నారులు నెలలు నిండక ముందే జన్మిస్తారు. అటువంటి పిల్లల్లో ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తుంటాయి. అటువంటి వారి ప్రాణాలకు అపాయం కలగకుండా నియో వార్మ్ పేరిట ఏర్పాటు చేసిన బ్లాంకెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని పరిశోధన టెక్నాలజీ సంస్థ వారు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సంస్థ వారు కొవిడ్ సమయంలో ఎన్ 95 ప్యూర్ ఫిల్టర్‌తో కూడిన కాటన్ క్లాత్‌తో కలిపి మాస్కులు తయారు చేశారు. చేనేత కార్మికులకు కొవిడ్ సమయంలో ఉపాధిని కల్పించేందుకు ఎన్ 95 మాస్కుల తయారీని 16 రాష్ర్టాల్లో దాదాపు 500 మంది మహిళ కార్మికులకు సీఎస్ఆర్, టాటా పవర్, టాటా స్టీల్, సేవా వంటి సంస్థలతో కలిసి లక్షా 40 వేల గంటల ఉపాధిని అందించింది. కొవిడ్ సమయంలో 6 లక్షల మాస్కులను పోలీసులతో పాటు పాఠశాల విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లకు, నిరుపేదలకు వాక్సిన్‌తో పాటు ఉచితంగా మాస్కులను అందించినట్లు సంస్థ నిర్వాహకుడు డాక్టర్ సత్యనారాయణ తెలిపారు.
బ్యూటీ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ తగ్గదు
ప్రస్తుతం మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ చాలా ఉంది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా సౌందర్య సాధనాలు కొనుగోలు చేస్తుంటారు. ఇందులో ఎంతమంది వ్యాపారులు కొత్తగా వచ్చినా నష్టం లేని రంగం ఇది. అయితే, మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్‌ను మళ్లీ మనం వాటినే కొత్త వ్యాపారంగా కాకుండా కస్టమర్ ఏం కోరుకుంటున్నాడో.. అందుకు తగ్గట్టుగా వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు ఎక్కువగా ఎలాంటి రసాయనాలు లేని సౌందర్య లేపనాలు విరివిగా వినియోగిస్తున్నారు. అందుకే మేం గత ఏడాది ‘ద అన్ప్లగ్డ్’ పేరుతో నేచురల్ ప్రొడక్ట్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాం. ఈ ఎక్స్పో మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కస్టమర్లతో చర్చించే అవకాశం కల్పించింది.
– నైనా అగర్వాల్ మల్హోత్రా, సీఈఓ – ద అన్ప్లగ్డ్