అమీర్‌పేట్,మార్చి 10 : దాసారం హట్స్ వాసులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గురువారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో హట్స్ నివాసితులు పెద్దసంఖ్యలో తరలి వెళ్లి మంత్రి తలసానిని కలిసి తమకు నల్లా కనెక్షన్లతో పాటు విద్యుత్ సదుపాయాలు కల్పించాలని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే హట్స్ బస్తీల్లో అధికారులతో కలిసి పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాసారం హట్స్ నివాసితులు కోరుతున్న సదుపాయాలు కల్పించేందుకు తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. హట్స్ సమీపంలో నిర్వహించే రోడ్డు నిర్మాణ పనులతో తమ గుడిసెలు పోతాయంటూ స్థానికంగా కొందరు ప్రచారం చేస్తున్న అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎటువంటి రోడ్డు నిర్మాణాలు జరిగినా.. ఇక్కడి గుడిసెలకు వచ్చిన ముప్పు ఏమి లేదని పేర్కొ న్నారు. కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు.