ఖైరతాబాద్, మార్చి 10 : ఛత్రపతి శివాజీ, మహాత్మా గాంధీ, సుభాశ్‌చంద్రబోస్ లాంటి మహనీయులకైనా తల్లి,దండ్రులే ప్రేరణనిచ్చారని రాచకొండ షీటీమ్స్ విభాగం డీసీపీ షేక్ సలీమా అ న్నారు. గురువారం సైఫాబాద్‌లోని అకౌంట్ జనరల్ ఆఫీసు ఆడిటోరియంలో అంతర్జాతీయ మ హిళా దినోత్సవాన్ని ఏజీ ప్రాంతీయ శిక్షణ సంస్థ డైరెక్టర్ జనరల్ చందా పండిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన షేక్ సలీమా మాట్లాడుతూ తల్లి సత్యమైతే….తండ్రి నమ్మకమని, పిల్లలకు ఆమెనే రోల్ మోడల్‌గా ఉండాలన్నారు. చిన్న చిన్న త్యాగాలను చేసి పిల్లలను సంరక్షించాలని, వారికి తగిన ప్రోత్సాహాన్నిచ్చి ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఎదుగుతున్న ఆడపిల్లల కోసం తల్లిదండ్రులు తగిన సమయం కేటాయించాలన్నారు. మహిళా ఉద్యోగి అయితే ఆఫీసుతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా చక్కదిద్దుకోవాల్సి ఉంటుందన్నారు. సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సుధా సిన్హా, పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు.