మెహిదీపట్నం మార్చి 9:ఉద్యోగాల నియామకంపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు సంబురాలు నిర్వహించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు.
పాతనగరంలో సంబురాలు ..
ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటింపుపై నిరుద్యోగులు, టీఆర్ఎస్ నాయకులు పాతనగరంలో సంబురాలు నిర్వహించుకున్నారు. పురానాపూల్ క్రాస్ రోడ్డులో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పుస్తె శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారుర. ఈ సందర్భంగా పుస్తె శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెంపదెబ్బ కొట్టారని తెలిపారు. నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకోవడానికి ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ, గోపీనాథ్ యాదవ్, ఇలియాస్ ఖురేషీ, పెండ్యాల లక్ష్మణ్, గోపీగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలకు దీటైన జవాబు…
ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించిన రోజు చరిత్రలో నిలిచిపోతుందని నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి ఠాకూర్ జీవన్ సింగ్, గుడిమల్కాపూర్ మాజీ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ తెలిపారు. 90వేలకు పైగా తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని 11 వేలకు పైగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించడం పై టీఆర్ఎస్ నాయకులు హర్షం ప్రకటిస్తూ నియోజకవర్గంలో సంబురాలు నిర్వహించారు. ఈ క్రమంలో కార్వాన్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పెద్ద ఎత్తున పటాకులు కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. ప్రభుత్వం పై నిత్యం ఆరోపణలు చేసే ప్రతిపక్షాలకు దీటైన జవాబిస్తూ 90 వేలకు పైగా ఉద్యోగ నియామక ప్రకటనలు చేయడం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కావూరి వెంకటేశ్, ముత్యాల భాస్కర్, తూంకుంట అరుణ్ కుమార్, వర్స తిరుమలేశ్, జగ్జీవన్, పట్లూరి పాల్గొన్నారు.
ఉద్యోగాన్ని సాధించుకుంటాం
నిరుద్యోగ యువత తమ విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు సాధించుకోవడం ఖాయం. రాష్ట్రంలో అర్హత ఉన్న వారు ప్రభుత్వం నియమ, నిబంధనల ప్రకారం దరఖాస్తులను చేసుకుని ఉద్యోగాలను సాధించుకోవాలి.ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను బట్టి ప్రభుత్వం నిర్వహించే నియామకాలు పారదర్శకంగా చేపట్టాలి. తప్పని సరిగ్గా ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తా.
నిరుద్యోగుల కల నెరవేర్చారు
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కలను సీఎం కేసీఆర్ ఎట్టకేలకు నెరవేర్చారు. నిరుద్యోగులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న అద్భుత సమయం ఆసన్నమైంది. ఉద్యోగాలు పొందాలనుకునే వారి కలలు నెరవేర్చినట్లయింది. నిరుద్యోగులు ఉద్యోగాలను సాధించి కుటుం బాలకు అండగా ఉండాలని ఆశిస్తున్నాం. నిరుద్యోగ యువత సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు.