సిటీబ్యూరో, మార్చి 5(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేలోనే అతి పెద్ద టెర్మినల్ నిర్మితమవుతోంది. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న మూడు రైల్వే టెర్మినళ్లకు గల భారాన్ని ‘చర్లపల్లి’లో నిర్మిస్తున్న టెర్మినల్ తగ్గించనుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్లో 32 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద రైల్వే టెర్మినల్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి (డిసెంబర్ 2023) అందుబాటులోకి తీసుకురావడం కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నది. రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయడం వల్ల సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గుతుంది.
చర్లపల్లిలోనే అన్ని రైళ్ల రాకపోకలకు తప్పనిసరిగా స్టాప్ ఉంటుంది. కొన్ని రైళ్లకు మాత్రం విజయవాడ, వరంగల్, గుంటూరు నుంచి వచ్చే కొన్ని రైళ్లకు చర్లపల్లే చివరి స్టేషన్ అవుతుంది. తిరిగి అక్కడి నుంచే రైళ్లు వెనుదిరుగుతాయి. దీంతో నగరానికి వచ్చే ప్రయాణికులలో దాదాపు 50 శాతం వరకు చర్లపల్లిలోనే రైలు దిగే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు. తిరిగి ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి అక్కడే ఎక్కుతారు. అక్కడి ప్రయాణికుల రాకపోకలను తట్టుకునే విధంగా ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లను తిప్పుతారు. పైగా ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాలలో ప్రయాణికుల తమ గమ్య స్థానాలు చేరుకునే విధంగా ఈ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ జీహెచ్ఎంసీ అధికారులు చర్లపల్లి స్టేషన్, ఎక్స్‌రోడ్ వరకు సిటీ బస్సులను పుష్కలంగా తిప్పుతున్నారు.
8 ప్లాట్‌ఫారాలు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అతి పెద్ద టెర్మినల్‌ను చర్లపల్లిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం, 4 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. అదనంగా మరో 4 ప్లాట్‌ఫారాలు నిర్మిస్తున్నారు. కొనసాగింపుగా చర్లపల్లిలో రైల్వే టెర్మినల్‌లో రైల్వే బోగీలకు సంబంధించి క్లీనింగ్, స్వీపింగ్ వంటి పనులు ఇక్కడే కొనసాగిస్తారు. అందుకు సంబంధించిన ట్రాకులు నిర్మాణాలు చేపడుతున్నారు. రైల్వే ట్రాకులు, ప్లాట్ ఫారాలు నిర్మిస్తున్నారు. అత్యాధునిక హంగులతో వాటిని తీర్చిదిద్దుతున్నారు. వచ్చే రెండేళ్లలో ప్రయాణికులకు ఈ టెర్మినల్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి రోజూ 12 గంటలకు పైగా పనులు కొనసాగిస్తున్నారు. పైగా, రైలు ఇంజిన్‌లో తలెత్తే లోపాలు, మైనర్ రిపేర్లు చేయడానికి పెద్ద షెడ్డును నిర్మిస్తున్నారు. ఈ షెడ్డు పనులు కూడా దాదాపు పూర్తి కావొచ్చాయి.
టెర్మినల్‌కు అనుగుణంగా కొత్త రైల్వే స్టేషన్..
అన్ని రకాల రైళ్లకు చర్లపల్లి స్టేషన్లో హాల్ట్ తప్పకుండా ఉంటుంది. దీంతో ప్రయాణికులు రైళ్లతో పాటు గూడ్స్ రైళ్ల రాకపోకలకు చెందిన కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో వాటి నిర్వహణ కోసం ఇప్పుడున్న చిన్న రైల్వే స్టేషన్ స్థానంలో అతి పెద్ద రైల్వే స్టేషన్ నిర్మించబోతున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించి ప్లానింగ్ పనులు పూర్తవుతున్నాయి. వాటిని రైల్వే బోర్డు అనుమతించిన వెంటనే పనులు కొనసాగించనున్నారు. రైల్వే టెర్మినల్ నిర్వహణ కోసం కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. సిగ్నల్ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. రైళ్లలో నీళ్లు నింపడానికి కావాల్సిన ఏర్పాట్లతో పాటు పెద్ద వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు.
చర్లపల్లి వరకు ఎంఎంటీఎస్ రైళ్ల పొడిగింపు..
టెర్మినల్ పనులు పూర్తవగానే నగర ప్రయాణికుల కోసం నడుస్తున్న ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు పొడిగించనున్నారు. ప్రయాణికులు చర్లపల్లి స్టేషన్లో దిగి ఎంఎంటీఎస్ ద్వారా లింగంపల్లి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ప్రాంతాలకు ప్రయాణికులు చేరుకునే విధంగా ప్రణాళికలు ఉన్నాయి.
టెర్మినల్ నిర్మాణానికి రూ.221 కోట్లు..
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో అతి పెద్ద రైల్వే టెర్మినల్‌ను చర్లపల్లి రైల్వే స్టేషన్లో నిర్మిస్తున్నారు. అందుకు రైల్వే ఆధ్వర్యంలో 32 ఎకరాల రైల్వే స్థలం అందుబాటులో ఉండటం విశేషం. ఈ రైల్వే ల్యాండులోనే ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల తాకిడి తగ్గించడంలో భాగంగా చర్లపల్లిలో రైల్వే టెర్మినల్‌ను ఏర్పాటు చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం దాదాపు రూ.221 కోట్లను నాలుగేండ్ల క్రితం బడ్జెట్లో కేటాయించారు. అయితే కొన్ని కారణాల వల్ల టెర్మినల్ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కానీ, గత ఏడాది నుంచి కూడా టెర్మినల్ నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి.
టెర్మినల్‌కు అన్ని వైపులా దారులే..
త్వరలో పూర్తి కానున్న చర్లపల్లి టెర్మినల్‌కు నగరంలోకి ప్రయాణికులు వెళ్లడానికి అన్ని వైపులా దారులు ఉన్నాయి. కొన్ని రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే చెంగిచర్ల, మేడిపల్లి నుంచి వరంగల్ హైవేకు చేరుకునే విధంగా కూడా లింకు రోడ్డు అందుబాటులో ఉంది. మరో పక్క చర్లపల్లి నుంచి కుషాయిగూడ, కీసర్గుట్ట వైపు వెళ్లడానికి కూడా లింకు రోడ్లు అందుబాటులో ఉన్నాయి. చర్లపల్లి నుంచి రాంపల్లి మీదుగా ఓఆర్ఆర్కు చేరుకునే విధంగా రోడ్డును అభివృద్ధి చేయబోతున్నారు. అందుకు సంబంధించిన స్థలంలో త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నగరంలోకి చేరుకోవడానికి అన్ని వైపుల నుంచి రోడ్డు కనెక్టివీటితో పాటు ఇప్పటికే ఆర్టీసీ బస్సులు పుష్కలంగా ఉన్నాయి. ప్రైవేటు వాహనాలూ తిరుగుతున్నాయి. ఇక్కడ నుంచి వరంగల్ హైవే రోడ్డుకు కూడా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. పైగా అక్కడి నుంచి ఔటర్ రింగురోడ్డు కూడా చర్లపల్లి స్టేషన్‌కు లింకు రోడ్డును అభివృద్ధి పరిచే ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి.
త్వరలో ఆర్వోబీ అందుబాటులోకి..
చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం పూర్తయితే, స్థానికంగా ప్రయాణికులు తాకిడి పెరుగనుంది. దీంతో రోడ్డును అనుసంధానం చేస్తూ పెంచుతున్నారు. టెర్మినల్‌కు దగ్గర్లో ఉన్న మల్లాపూర్ – నాచారం రోడ్డుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు కనెక్టివిటీ ఉండే విధంగా 100 ఫీట్ల రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. అందుకోసం ఇప్పటికే చర్లపల్లి జంక్షన్ నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేసింది. వీలైనంత త్వరలోనే ఈ ఆర్వోబీని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.
చుట్టు పక్కల భూములకు ధరలు..
చర్లపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే టెర్మినల్ నిర్మిస్తుండటం వల్ల చుట్టుపక్కల ఉండే స్థలాలు, ఇండ్ల ధరలకు రెక్కలు వచ్చాయని స్థానికులు చెబుకుంటున్నారు. గతంలో గజం ఐదువేల నుంచి 10 వేల రూపాయల వరకు ఉంటే., ప్రస్తుతం రూ.35 వేలకు చేరుకుందన్నారు. టెర్మినల్ పనులు పూర్తయితే ఇక్కడ స్థలాలు గజం రూ.70 వేలకు పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, దీంతో చోటా మోటా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చుట్టు పక్కల అపార్టుమెంట్ల నిర్మాణాలపై దృష్టి సారించారు. పైగా ప్రయాణికులు సౌకర్యార్థం ఆయా ప్రాంతమంతా కమర్షియల్ ఏరియాగా మారబోతుంది. హోటళ్లతో పాటు అనుబంధ వ్యాపార సముదాయాలు కూడా అక్కడ మొదలు కానున్నాయని స్థానికులు చెప్పుతున్నారు.
వ్యాపార సముదాయాల ఏర్పాటు..
ప్రయాణికుల సౌకర్యార్థం వ్యాపార సముదాయాలు నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అందుకు అవసరమైన స్థల సేకరణ చేస్తున్నారు. ఈ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల కోసం సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలో హోటళ్లతో పాటు అన్ని రకాల షాపులు ప్రారంభించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు..
చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద రైల్వే టెర్మినల్‌కు ప్రయాణికుల రాకపోకలతో పాటు వాహనాలు తాకిడి కూడా బాగా పెరుగనుంది. భవిష్యత్తులో వాహనాల తాకిడిని దృష్టిలో పెట్టుకుని అందుకు సంబంధించిన స్థలాలను కూడా సిద్ధం చేస్తున్నారు. చర్లపల్లి స్టేషన్‌కు ఆనుకొని ఉన్న ఫారెస్ట్ ల్యాండ్‌ను పార్కింగ్‌గా తీర్చిదిద్దబోతున్నారు. అందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సువిశాలంగా ఉండే ఫోర్ వీలర్, టూ వీలర్, ప్రైవేటు వాహనాలు తిరుగడానికి వీలుగా టెర్మినల్‌లో పార్కింగ్‌ను తీర్చిదిద్దుతున్నారు.