సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : మహానగరవాసులకు మరింత ఆహ్లాదాన్నిచ్చేందుకు శివారులో సుందరమైన పార్కు రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఈ నయా పార్కుకు రూపకల్పన చేస్తోంది. ఎప్పటినుంచి ప్రతిపాదనల్లో ఉన్న హిమాయత్‌సాగర్ సమీపంలోని కొత్వాల్‌గూడ ఎకో పార్కునే తాజాగా నగర వాసులకు పూర్తిస్థాయిలో ఆహ్లాదాన్ని పంచే పార్కుగా చూడచక్కగా తీర్చిదిద్దనున్నారు. మహానగరానికి మణిహారంలాంటి ఔటర్ రింగురోడ్డును ఆనుకొని గచ్చిబౌలి-శంషాబాద్ మార్గంలో హిమాయత్‌సాగర్ జలాశయం పక్కన సుమారు 85 ఎకరాల స్థలం ఉంది. ఔటర్‌కు ఇరువైపులా 60 ఎకరాలు హిమాయత్‌సాగర్ వైపు, రాజేంద్రనగర్ మానసహిల్స్ను ఆనుకొని మరో 25 ఎకరాల స్థలం హెచ్ఎండీఏ ఆధీనంలో ఉంది. పార్కుల అభివృద్ధి, నిర్వహణలో హెచ్ఎండీఏ ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తున్నది. ఇప్పటికే గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లో పలు ఉద్యానాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా ఐటీ కారిడార్ వైపు పార్కులు చాలా తక్కువ. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఓఆర్ఆర్ మార్గంలో ఐటీ కంపెనీలు, అందులో పనిచేసే ఉద్యోగులు, చుట్టుపక్కల ప్రాంతాలవాసులకు కొత్వాల్‌గూడ స్థలంలో అద్భుతమైన పార్కును తీసుకొచ్చే లక్ష్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
రూ.60 కోట్లతో పార్కు అభివృద్ధి
కొత్వాల్‌గూడలో ఉన్న హెచ్ఎండీఏ స్థలంలో కొన్నేళ్లుగా ఎకో, నైట్ సఫారి వంటి ప్రాజెక్టులను చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినా, ఆచరణలో సాధ్యం కాలేదు. ఫలితంగా అందుబాటులో ఉన్న 85 ఎకరాల్లో తక్కువ వ్యయంతో నగరవాసులందరికీ ఆహ్లాదాన్ని పంచేలా పార్కును అభివృద్ధి చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగానే అధికారులు కొత్వాల్‌గూడలోని స్థలంలో పార్కును అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రాథమిక డిజైన్లను రూపొందిస్తున్నారు. ఈ డిజైన్లకు మంత్రి ఆమోదం లభిస్తే వెంటనే హెచ్ఎండీఏ సొంత నిధులతోనే పార్కును అభివృద్ధి చేసి నగర వాసులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకు సుమారు రూ.60 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. పార్కుగా అభివృద్ధి చేసిన తర్వాత అందులో ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడం ద్వారా కొంత ఆదాయాన్ని, పార్కుకు వచ్చే సందర్శకుల ద్వారా కొంత ఆదాయాన్ని పొందేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
సాగరం చెంతనే అత్యాధునిక పార్కు
జంటజలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్ ప్రముఖ పర్యాటక క్షేత్రంగా ఉంది. జలాశయం నిండుగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది ఈ జలాశయం చూసేందుకు వచ్చి వెళుతున్నారు. ఇలాంటి ప్రాంతంలోనే ఉన్న కొత్వాల్‌గూడ హెచ్ఎండీఏ స్థలంలో పార్కును అభివృద్ధి చేయడం ద్వారా ఎంతోమందికి ఆటవిడుపుగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. నగరంలో కేబీఆర్ పార్కు తరహాలో ఐటీ కారిడార్‌లో, ఔటర్ రింగురోడ్డు వెంట అలాంటి పార్కును అభివృద్ధి చేసేందుకు ఇది అనువైన స్థలంగా ఉందని అధికారులు తెలిపారు. 85 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే పార్కుకు అద్భుతమైన ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేసి, లోపల పచ్చదనం పరిచేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. ముఖ్యంగా ఇక్కడున్న క్వారీలను అందంగా మలచనున్నారు. పార్కులో ఆహ్లాదాన్ని పంచడంతోపాటు ఆటవిడుపు కోసం పలు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని లుంబినీ పార్కు, ఎన్టీఆర్గార్డెన్, సంజీవయ్యపార్కు, కేబీఆర్ పార్కు, సరూర్‌నగర్ లాంటి పార్కులను అభివృద్ధి చేసినట్లుగానే కొత్వాల్‌గూడ పార్కును హెచ్ఎండీఏ తీర్చిదిద్దనుంది.