సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తేతెలంగాణ): చేతులతో అద్భుతాలు చేయవచ్చు.. కానీ ఆయన చేతివేళ్ల గోళ్లపై సందేశాత్మక, సమరయోధులు, ప్రపంచవింతల చిత్రాలు వేస్తూ అబ్బురపరుస్తున్నారు. అంతేకాదు నెయిల్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామంలో చేనేత కుటుంబంలో జన్మించిన నరహరి అందరి కంటే వినూత్నంగా ఆలోచించారు. తండ్రి రామచంద్రయ్య స్ఫూర్తితో కళాకారుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. జేఎన్టీయూలో ఫైన్ఆర్ట్స్లో పట్టా పొందిన నరహరి చేతిగోళ్లపై చిత్రాలు వేయడం ప్రారంభించారు. 1989 నుంచి ఇప్పటివరకు 140కి పైగా చిత్రాలు లిఖించారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, ప్రపంచవింతలు, విశేషాలతోపాటు సామాజిక అంశాలపై అనేక చిత్రాలు గీసి ఎందరో ప్రశంసలు అందుకున్నారు. మరెన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.
తాజాగా భారత చిత్రపటంతోపాటు జాతీయజెండాను చేతి గోళ్లపై వేసి అబ్బురపరుస్తున్నారు. ఇండియా రికార్డ్స్ ఆఫ్ బుక్ వారు మొట్టమొదటి నెయిల్ ఆర్టిస్టుగా పేరు నమోదు చేశారని..ఇది తనకెంతో గుర్తింపునిచ్చిందని, బాధ్యతను కూడా పెంచిందని నరహరి పేర్కొన్నారు. అట్లాగే అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అమేజింగ్ వరల్డ్ రికార్డ్‌తోపాటు గ్లోబల్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించి సత్కరించిందని ఆయన గుర్తుచేశారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు 65 గంటలపాటు నాన్‌స్టాప్‌గా చిత్రాలు వేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నించినట్లు వెల్లడించారు. నరహరి ప్రస్తుతం లంగర్‌హౌస్ పరిధిలో నివాసముంటూ..అమీర్‌పేటలోని సిస్టర్ నివేదిత స్కూల్లో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. తన కళను నేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నవారికి శిక్షణ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని చెప్పారు.