సిటీబ్యూరో, మార్చి 5(నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలు 200 శాతం పెరిగాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. అప్రమత్తత, అవగాహనతోనే వాటిని అరికట్టవచ్చని చెప్పారు. సైబర్ నేరాల నివారణ కోసం సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సైబర్ క్రైం అవగాహన షార్ట్ ఫిలిం పోటీల్లోని విజేతలకు శనివారం బహుమతులు, నగదు రివార్డులను అందించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఆగంతకులకు వ్యక్తిగత, బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పవద్దని, అనుమానాస్పద లింక్లు ఓపెన్ చేయవద్దని సూచించారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచి..సైబర్ నేరాలను అరికడుతామన్నారు. కార్యక్రమంలో ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, క్రైం డీసీపీ కల్మేశ్వర్, సైబర్ క్రైం డీసీపీ లావణ్య, ఎస్సీఎస్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.