సిటీబ్యూరో, మార్చి 5(నమస్తే తెలంగాణ):పొద్దున లేవగానే.. అందరూ ల్యాప్‌టాప్‌లు….స్మార్ట్ ఫోన్లు పట్టుకొని.. ఊరు బయటకు వెళ్తారు. సాయంత్రానికి ఖాతాల్లో లక్షలు నింపుకొని..ఆనందంగా ఇంటికి చేరుతారు.. ఇలా బీహార్‌లోని నవ్వాడ గ్రామంలో కొందరు ఈజీ మనీ కోసం సైబర్ దోపిడీ మార్గాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. గ్రామంతో పాటు మరో నాలుగైదు ఊర్లు కలిపితే..సుమారు 200 మంది యువకులు, మధ్యవయస్కులు ఈ నేరాల్లో ఆరితేరి.. చీటింగ్లే తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు.
నవ్వాడ చీటర్స్ ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం ఈ-కామర్స్ సైట్స్‌లో షాపింగ్ చేసే వారి సమాచారాన్ని ఏజెంట్ల ద్వారా రాబట్టి.. వారికి ఫోన్లు చేసి గాలం వేస్తున్నారు. ఇలా సైబర్ మోసానికి పాల్పడుతున్న గ్రామంలోని సుమారు 200 మంది విద్యార్హత 10 లోపే ఉండడం గమనార్హం. ఇటీవల రాచకొండ సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ వెంకటేశ్ బృందం చేసిన దర్యాప్తులో ఇలాంటి ఆసక్తికరమైన అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.
పలు భాషల్లో పట్టుసాధించి..
పంజాబీ, భోజ్‌పురి, గుజరాతి, హిందీ, ఆంగ్లం భాషలపై పట్టుసాధించిన రాకేశ్‌కుమార్ మహతో ..ల్యాప్‌టాప్ కొనుక్కుని ఏజెంట్ల ద్వారా నాప్టాల్, స్నాప్‌డీల్, షాప్ క్లూస్‌లో షాపింగ్ చేసి.. అందులో వివరాలను నమోదు చేసుకున్న వినియోగదారుల సమాచారాన్ని ఏజెంట్ల నుంచి కొనుగోలు చేశాడు. అమాయకులకు ఫోన్లు చేసి..లక్కీ డ్రా వచ్చిందని.. బహుమతి గెల్చుకున్నారంటూ.. ఇలా మాయమాటలు చెప్పి.. అకౌంట్లను కొల్లగొట్టాడు. రాకేశ్ మూడేండ్లలో దాదాపు కోటి రుపాయాలకు పైగా అమాయక ప్రజల నుంచి తస్కరించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలంగాణలో మొత్తం 22 మంది డబ్బును దోచేసినట్లు గుర్తించారు. అలాగే నవ్వాడతో పాటు మరో నాలుగైదు గ్రామాల్లో సైబర్‌చీటర్లకు ఫోర్జరీ సిమ్‌లను కొంత మంది ఏజెంట్లు రూ. 500 నుంచి వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
ఆపరేషన్ ‘నవ్వాడ’
కేసు దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ వెంకటేశ్ బృందం దాదాపు వారం రోజులకు పైగా నవ్వాడ పరిసర ప్రాంతాల్లో తిష్ట వేసి…సైబర్ క్రిమినల్స్ గురించి ఆరా తీసింది. మొత్తం ఆధారాలు సేకరించి, లొకేషన్‌ను గుర్తించి.. బీహార్ పోలీసు ఉన్నతాధికారుల సహాయంతో స్థానిక పోలీసుల సహకారంతో రాకేశ్‌కుమార్ మహతోను పట్టుకుంది.
కూలీ నుంచి సైబర్ చీటర్
ఈ-కామర్స్ వెబ్సైట్లో ఈయర్ ఫోన్స్‌ను కొనుగోలు చేసిన విద్యార్థిని ఆమె తల్లికి సైబర్ మాయగాళ్లు టోకరా వేసి.. 33 లక్షలు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాచకొండ పోలీసులు నిందితుడు రాకేశ్‌కుమార్ మహతోను అరెస్టు చేసి మొత్తం నగదును జప్తు చేశారు. దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశాయి. బీహార్ నవ్వాడకు చెందిన రాకేశ్‌కుమార్ మహతో 10వ తరగతిని మధ్యలో వదిలేశాడు. గతంలో ఢిల్లీ, పంజాబ్, గుజరాత్లో కూలీగా, రైల్వే ప్లాట్‌ఫాంపై మురమరాలు విక్రయం, ఫ్యాక్టరీల్లో లేబర్‌గా పని చేశాడు. ఆదాయం సరిపోలేదు. ఊరుకు వచ్చి తన తోటి వారు చేస్తున్న సైబర్ మోసాల గురించి తెలుసుకున్నాడు. వారికి అకౌంట్ ఇప్పించి.. పాస్‌బుక్, చెక్ బుక్, ఏటీఎం, కార్డు, బ్యాంక్‌కు లింక్ అయిన సిమ్ కార్డులను ఇచ్చినందుకు సైబర్‌నేరగాళ్లు రాకేశ్‌కుమార్‌కు రూ. 5వేల కమీషన్ ఇచ్చేవారు. ఈ ఆదాయం సంతృప్తిని ఇవ్వకపోవడంతో తానే సైబర్ నేరాలకు పాల్పడేందుకు సిద్ధమయ్యాడు.