సిటీబ్యూరో, మార్చి 5(నమస్తే తెలంగాణ): నిరుపేద చిన్నారులకు గుండె చికిత్స అందించేందుకు అవసరమైన సహాయం చేస్తామని ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో శనివారం ఏర్పాటు చేసిన ‘ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్’ ప్రారంభోత్సవానికి తన భార్య నమ్రతతో కలిసి మహేశ్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటుడు మహేశ్‌బాబు మాట్లాడుతూ చిన్నారుల గుండెను కాపాడే ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషంగా ఉందని, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో తనకు దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడు ముందుంటానన్నారు. పేద చిన్నారులకు గుండె చికిత్సలు అందిచేందుకు రెయిన్బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసిన ‘ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్’కు ‘మహేశ్ బాబు ఫౌండేషన్’ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు.
తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 125 మంది చిన్నారులకు వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చిన్న స్వామి రెడ్డి మాట్లాడుతూ, పుట్టుకతోనే గుండె వ్యాధులతో బాధపడే నిరుపేద చిన్నారులకు తమ వంతు మద్దతుగా అవసరమైన చికిత్సను అందించేందుకు రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ‘ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్’ను స్థాపించామని చెప్పారు. రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వర్రావు మాట్లాడుతూ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే లోపాలలో పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులు కూడా ఒకటని, రెయిన్బో హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో దాదాపు 900కు పైగా కార్డియాక్ సర్జరీలను చేయడంతో పాటు గడిచిన రెండేళ్లలో 850కి పైగా కార్డియాక్ ప్రక్రియలను జరిపినట్లు వివరించారు. ఈ రోగుల్లో ఎక్కువ మంది సంవత్సరం వయస్సులోపు ఉన్న పిల్లలే అధికంగా తీవ్రమైన గుండె సమస్యతో బాధపడినవారున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కంచర్లతో పాటు పలువురు రెయిన్బో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.