కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 2 : పారిశుధ్య పనులలో నిర్లక్ష్యం తగదని, పరిసరాల పరిశుభ్రతకు బాధ్యతగా పనిచేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం జోన్ ఆఫీస్‌లో ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లు, ఏఎంహెచ్వోలతో జడ్సీ మమత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుధ్య విభాగం అధికారులు ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రధాన రోడ్లు.. అంతర్గత రోడ్లలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సర్కిళ్ల పరిధిలో పనిచేస్తున్న ఆర్ఎఫ్సీ వాహనాల వినియోగం, పనితీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఎన్వీరాన్‌మెంటల్ సూపర్వైజర్లు తడిపొడి చెత్తను శాట్ ఆటోలలో వేరువేరుగా వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి డంపింగ్ యార్డుకు చెత్తచెదారాన్ని తరలించే వరకు పర్యవేక్షణ చేయాలన్నారు. వచ్చే బుధవారం నాటికి పారిశుధ్య విభాగానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, నిరంతరం నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యూఆర్ కోడ్ ప్రకారం ఏజెన్సీలకు బిల్లులు చెల్లించాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి పరిసరాలు పరిశుభ్రంగా మార్చాలని కోరారు. కార్యక్రమంలో డీసీలు రవికుమార్, రవీందర్‌కుమార్, మంగతాయారు. ప్రశాంతి, సీటీవో గోవర్ధన్, ఏఎంహెచ్వోలు సంపత్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, భానుచందర్, ప్రశాంతి, నిర్మల, ఏఎంసీ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఎస్లు, సూపర్వైజర్లు ఉన్నారు.