కుర్మల్‌గూడలో.. కంపోస్టు ఎరువు తయారీ కేంద్రం
సంతలు, మార్కెట్ వేస్టేజీతో ఎరువు తయారీ
బడంగ్‌పేట, మార్చి 2: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్‌గూడలో ఆర్గానిక్ కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక షెడ్డును ఏర్పాటు చేశారు. 45 రోజుల్లో ఆర్గానిక్ కంపోస్టు ఎరువును తయారు చేయడానికి సమయం పడుతుందని అధికారులు చెప్పారు. అల్మాస్గూడ, నాదర్గుల్, గుర్రంగూడ, బాలాపూర్, వెంకటాపూర్, మామిడిపల్లి తదతర ప్రాంతాల్లో జరిగే వారాంతపు సంతల్లో పడేసిన వ్యర్థాలను, కూరగాయల వ్యార్థాలను మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో సేకరించి ఎరువులు తయారు చేస్తున్న కేంద్రానికి తరలిస్తారు. ఈ వ్యర్థాలతో ఎరువులను తయారు చేయడానికి ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఆరుగురు సిబ్బందిని నియమించారు. సేకరించిన వ్యర్థాల నుంచి ఎరువులకు అవసరమైన పదార్థాన్ని సేకరిస్తారు.
హరితహారం మొక్కలకు..
కుర్మల్‌గూడలో తయారు చేస్తున్న ఆర్గానిక్ ఎరువులను హరితహారంలో నాటిన మొక్కలకు ఉపయోగించనున్నారు. డబ్బులు పెట్టి ఎరువులు కొనుగోలు చేయకుండా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి రసాయనాలు లేని ఆర్గానిక్ ఎరువు వాడటంతో మొక్కలు త్వరగా పెరగడానికి దోహదపడుతుందని భావించారు. దీంతో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, ప్లాలకవర్గ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్గానిక్ ఎరువులు తయారు చేయిస్తున్నాం
కుర్మల్‌గూడలో ఆర్గానిక్ ఎరువులను కురగాయలు, ఇతర వ్యర్థాలతో తయారు చేయిస్తున్నాం. త్వరలో చెత్తను రీసైక్లింగ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. అందులో భాగంగానే ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయించాం. త్వరలో కొత్తగా మిషన్లు ఏర్పాటు చేస్తున్నాం. దూర ప్రాంతాలకు చెత్తను తరలించాల్సిన అవసరం లేకుండానే ప్రతిరోజు పది టన్నుల వరకు చెత్తను రీసైక్లింగ్ చేస్తాం. నెల రోజుల్లో ఆర్గానిక్ ఎరువుతో పాటు చెత్త మిషన్లు రాబోతున్నాయి.
– చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మేయర్
ఆరుగురు సిబ్బందిని కేటాయించాం
ఆర్గానిక్ కంపోస్టు ఎరువును తయారు చేయడానికి ఆరుగురు సిబ్బందిని కేటాయించాం. కార్పొరేషన్ పరిధిలో వ్యాపారులు పడవేసిన కూరగాయాలు, ఆకు కూరలు సేకరించి, ఈ వ్యర్థాలను తీసుకురావడాకి ఆటోను ఏర్పాటు చేశాం. తడి, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు కూరగాయాలు, ఆకు కూరల్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్లు ఉంటే తొలిగిస్తారు. 45 రోజుల్లోనే ఎరువు తయారవుతుంది.
– వంకాయల యాదగిరి, శానిటేషన్ ఇన్స్పెక్టర్