జూబ్లీహిల్స్, మార్చి 2 : ఐదేండ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు మూడో రోజు ముమ్మరంగా సర్వే చేపట్టారు. ఫిబ్రవరి 27న నిర్వహించిన పల్స్ పోలియో శిబిరాల్లో చుక్కల మందు వేయించుకోలేని పిల్లల కోసం వైద్య బృందాలు బస్తీలు, కాలనీల్లో ఇంటింటి సర్వే చేపట్టారు. సోమవారం నుంచి బుధవారం వరకు వైద్య బృందాలు మూడు రోజులపాటు ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలకు టీకాలు వేశారా? లేదా అని పరిశీలించారు. శ్రీరాంనగర్‌లో 9,833 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్రిత తెలిపారు. బుధవారం వైద్య సిబ్బందితో కలిసి సర్వే చేపట్టారు. కాగా పిల్లలకు పోలియో చుక్కల ప్రక్రియపై ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందాలు కూడా విస్తృతస్థాయిలో సర్వే నిర్వహించారు. గత మూడు రోజులుగా ఆయా బృందాల ప్రతినిధులు వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. కొన్నిచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో శ్రీరాంనగర్ క్లస్టర్‌లోని పీహెచ్‌సీల్లో ఒక వైపు వైద్య సిబ్బంది, మరోవైపు బ్ల్యూహెచ్ఓ బృందాలు విస్తృతస్థాయి సర్వే నిర్వహించారు. శ్రీరాంనగర్ క్లస్టర్లో ఐదేండ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు ఆమె తెలిపారు.