తిరిగి బాధితులకు అప్పగించిన రైల్వే పోలీసులు
మారేడ్‌పల్లి, మార్చి 2: సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు సింహపూరి ఎక్స్‌ప్రెస్ రైల్లో వెళ్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు ఈ నెల 1న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నంబర్ 10లో తన హ్యాండ్ బ్యాగ్ మరచిపోయి రైలు ఎక్కి వెళ్లిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసు సిబ్బంది ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు ఆ బ్యాగ్‌ను తెరచి చూడగా…అందులో ఒక సెల్ ఫోన్, రూ.1050 నగదు, మందులు ఉన్నాయి. అదే సమయంలో గాజుల రామారం ప్రాంతానికి చెందిన అన్వార్ పోలీసుల వద్ద ఉన్న సెల్ ఫోన్‌కు ఫోన్ చేయగా…పోలీసులు మాట్లాడారు. మీ వద్ద ఉన్న బ్యాగ్ మా అమ్మయిదని, పేరు బీబీజాన్ అని, సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు రైల్లో వెళ్తుందని పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు అన్వర్‌ను పోలీసులు పిలిపించి బ్యాగ్‌ను అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వే పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
మరో ఘటనలో…. పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైల్లో తిరుపతి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు డి. సుమతి అనే ప్రయాణికురాలు చేరుకుంది. రైలు ప్లాట్ ఫారంకు చేరుకున్న అనంతరం మహిళ తన బ్యాగ్‌ను సీటుల్లో మరచిపోయి వెళ్లిపోయింది. అనంతరం గంట తరువాత స్టేషన్‌కు వచ్చి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటికే ఆ రైలు స్టేషన్ నుంచి యార్డుకు వెళ్లిపోయింది. రైల్వే పోలీస్ సిబ్బంది యార్డుకు వెళ్లి రైల్లోని కోచ్‌ను తనిఖీలు చేయగా సీటులో బ్యాగ్ లభించింది. ఆ బ్యాగ్‌లో 5 గ్రాముల ముత్యాల హారం, 2 వేల నగదు, విలువైన దుస్తులు ఉన్నాయి. వెంటనే బాధితురాలు డి. సుమతికి రైల్వే పోలీసులు ఆ బ్యాగ్‌ను అప్పగించారు.