సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : మెగా రికార్డ్స్ క్రియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఫీనిక్స్ ఎరీనా గార్డెన్లో స్వామి వివేకానంద అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ‘ఆల్ టాలెంటెడ్ గ్రేట్ ఎచివర్స్ ఆఫ్ డిఫరెంట్ ’ క్యాటగిరిలో కళా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మెగా సంస్థ సేవలు అభినందనీయమని అన్నారు. వేదికపై యోగ ప్రదర్శన, చిన్నారుల కూచిపూడి నాట్య ప్రదర్శన, చిత్రలేఖనం, నాగసాయి బృందం భక్తి గీతాల ఆలాపనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బొర్ర వాసుదేవా చార్యులు, వనం సూర్యప్రకాశ్, వి.ప్రసాద్, బొడ్డు బొందయ్య, సాయి అలేఖ్య నాయుడు, మేకల అనురాధ దాస్, కట్ట శ్రావ్య, బండి రాములు, మధు కుమార్, రుక్మిణి మాతాజీ, చోడవరపు శ్రీనివాసు, రవళి, హరి పుష్ప, తుమ్మల గీత, మౌనిక, లీలా శృతి, శ్రావణ్ కుమార్, రమాదేవి, మహమ్మద్ సాలిదిన్, తదితరులు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి వ్యవహరించారు. అతిథులుగా ఎ.సదనందు కిశోరి, సూర్యపల్లి శ్రీనివాస్, అశోక్ రెడ్డి , పొలిటికల్ కార్టూనిస్ట్ నారు, గురప్పా మల్లు గాళ్ల, ఎల్లా సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.