సిటీబ్యూరో, మార్చి 1(నమస్తే తెలంగాణ);ఏఓసీ గేట్.. బెటాలియన్ల కొద్దీ సైనికులుండే ప్రాంతం. పెద్ద పెద్ద గేట్లు, పరిసరాలు ముళ్ల కంచెలతో నిత్యం సాయుధ సైనికుల కాపలాతో దర్శనమిస్తుంటాయి. యుద్ధానికి తాము సిద్ధమేనన్నట్లు ఉండే ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ) పరిధిలోని ప్రాంతాలు ఇటీవల పలు పెయింటింగులతో కళకళలాడుతున్నాయి. భారత ఆర్మీ సేవల్ని కీర్తిస్తూ గోడలపై జవహర్లాల్ నెహ్రూ అర్కిటెక్షర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) విద్యార్థులు 60 కుడ్య చిత్రాలను అత్యద్భుతంగా చిత్రించారు. ఏఓసీ సర్కిల్లో ఇరువైపులా ఆలోచింపజేసే చిత్రాలు వెలిశాయి. సికింద్రాబాద్ క్లబ్ నుంచి (జేబీఎస్ సిగ్నల్ నుంచి) ఏఓసీ గేట్లోకి వెళ్లిన తర్వాత ఎడమచేతి వైపు ఉన్న గోడలపై ‘విధులు నిర్వహించే భారత సైనికులు, వారి త్యాగాలను కీర్తిస్తూ పలు చిత్రాల’ను రూపొందించారు. ఈస్ట్ మారేడుపల్లి నుంచి ఏఓసీ గేట్లోకి వెళితే కుడివైపున ‘1948 సెప్టెంబర్లో జరిగిన ఆపరేషన్ పోలో, హైరాబాద్ నగర కీర్తి పతాకమైన చార్మినార్’ లాంటి అనేక చిత్రాలు దర్శనమిస్తున్నాయి. కాగా, ఈ చిత్రకళా ఖండాలు అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులతో పాటు విద్యార్థులు, యువతను తీక్షణంగా ఆలోచింపజేస్తున్నాయి. ఎంతో అద్భుతంగా చిత్రాలను రూపొందించిన జేఎన్ఏఎఫ్ఏయూ విద్యార్థులను కీర్తిస్తూ, వారి కళా సేవలకు పలువురు ఫిదా అవుతూ అభినందిస్తున్నారు.