సికింద్రాబాద్, ఫిబ్రవరి 28: ‘పేదల చిరకాల వాంఛ సొంత గూడు.. మనకంటూ ఒక ఇల్లు’ ఉంటే ఎలాగైనా.. బతుకొచ్చనే ధీమా.. పొద్దంతా కూలీ నాలి చేసుకుని వచ్చి తల దాచుకోవడానికి కాస్త చోటుంటే ఎంతో ధైర్యం. వారి కలలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తున్నది. చిరకాల కోరికను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మారేడ్‌పల్లిలోని డబుల్ ఇండ్ల సముదాయంలో తొలి విడతలో భాగంగా 240 ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్యే, బోర్డు సభ్యులు, హౌజింగ్ అధికారులు డబుల్ ఇండ్లను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 240 మంది లబ్ధిదారులకు డబుల్ ఇండ్ల పట్టాలను అందజేయనున్నారు.
అనంతరం, 15వ తేదీన రెండో విడత ఇండ్లకు సంబంధించి బస్తీ సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంమీద మారేడ్‌పల్లిలో సుమారు 471 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తుండగా, మొదటి దఫాలో 240 ఇండ్లు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మారేడ్‌పల్లిలో ఇండ్ల్ల నిర్మాణాలు దాదాపు పూర్తిచేసుకోవడం సంతోషకరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదలకు గూడు కల్పిస్తుండటం ఆనందంగా ఉన్నదని చెప్పారు. పేదలు సొంతగూడులో అడుగు పెట్టడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
తొలి విడతలో 240 ఇండ్లు..
కంటోన్మెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా మారేడ్‌పల్లిలో నిర్మిస్తున్న డబుల్ ఇండ్ల సముదాయంలో మొదటి దఫాలో సుమారు 240 ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు పట్టాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
కల నెరవేరింది
బస్తీలో చాలా ఏండ్ల నుంచి ఉంటున్నం. ఇప్పటి దాక ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చి పోయిన్రు. కానీ, మా గురించి ఎవ్వరూ పట్టించుకోలె. ఎమ్మెల్యే గోపన్న మా బస్తీకి ఇంటి పెద్దగా భావించి ఇండ్ల పొసెషన్ సర్టిఫికెట్ల గురించి పట్టించుకున్నడు. దీంతోనే ఈరోజు ఆ సర్టిఫికెట్లు మా చేతికి వచ్చినయ్ కేసీఆర్ సారు, గోపన్న సారు మాకు చేసిన మేలును ఎన్నటికి మర్చిపోము.
– శారద, లబ్ధిదారు
పేదల బాగోగులు పట్టించుకునే వారేరీ
ఛత్రపతి శివాజీనగర్ బస్తీలో రోడ్లు లేకుండె, డ్రైనేజీ సరిగ్గా లేకుండె. గత ఐదారేండ్లలో లక్షల రూపాయలతో అంతర్గత రోడ్లు వేశారు. పటిష్టమైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను తెచ్చి దీర్ఘకాల సమస్యను దూరం చేశారు. ఇంక ఇండ్ల సర్టిఫికెట్ల గురించి చాలా బాధలు పడినం. ఈరోజు అది కూడా సాకారమైంది. ఇంతకు ముందున్న ఎమ్మెల్యేలు ఒక్క సమస్యను కూడా తీర్చలేదు.
– దీదీబాయి, లబ్ధిదారు