సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : చదవడమే కాదు.. వినడం కూడా విజయంలో శక్తివంతమైన పరికరంగా పనిచేస్తుందని సూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జరార్ అన్నారు. సృజనాత్మకత అంకగణితంపై పది నిమిషాల పాటు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కరూ అంకగణిత చాంపియన్‌గా మారుతారని తెలిపారు. నగరంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా నిర్వహించిన రోడ్ మ్యాప్ ఫర్ కెరియర్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, ఇతరులతో పోల్చుకోవడం తగదని సూచించారు. విద్యార్థులు కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే జీవితంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువస్తారని తెలిపారు. విద్యార్థులు తమను తాము విశ్వసించినప్పుడే అనుకున్న విజయాలు సాధించగలరని అన్నారు. విద్యార్థి దశను ఆస్వాదిస్తూనే ఉన్నత సాంకేతిక మెలకువలను నేర్చుకుంటూ తమను తాము పోటీ ప్రపంచం కోసం సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం విభాగాధిపతి అనురాధ మాట్లాడుతూ ఇంత మంచి ఉపయోగకరమైన వర్క్‌షాపును విద్యార్థుల కోసం నిర్వహించిన తెలంగాణ పబ్లికేషన్స్ యాజమాన్యానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ సర్యులేషన్ మేనేజర్ టి.గణేశ్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.