సిటీబ్యూరో, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): బ్రాండెడ్ కంపెనీల ముద్రతో ఉన్న నాసిరకం షర్టులను అమ్ముతున్న ఓ వ్యాపారిని రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…కొత్తపేటకు చెందిన సంది సత్యపాల్ రెడ్డి విజయ గార్మెంట్స్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. బెంగళూరులో ఫుట్‌పాత్‌లపై కొందరు నాసిరకం షర్టులకు బ్రాండెడ్ కంపెనీలైన అలెన్‌సోలీ, లూయిస్ ఫిలిప్ పేర్లతో ఉన్న స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నారని తెలుసుకున్నాడు. వాటిని అక్కడ రూ. 200లకు కొనుగోలు చేసి.. తన షాపులో రూ.650కు అమ్ముతున్నాడు. అంతేకాకుండా భారీగా బెంగళూరు నుంచి షర్టులను హోల్‌సేల్‌గా తీసుకొచ్చి.. వాటిని చిన్న చిన్న బట్టల దుకాణాల్లో కొంత మార్జిన్ పెట్టుకుని అమ్మేస్తున్నాడు. ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారని అడిగినప్పుడు జీఎస్టీ కట్టకుండా తీసుకువస్తున్నామని, అందుకే ధరను తగ్గించి విక్రయిస్తున్నట్లు చెప్పేవాడు. విషయం లూయిస్ ఫిలిప్, అలెన్ సోలీ కంపెనీల ప్రతినిధుల దృష్టికి రావడంతో రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టి.. సత్యాపాల్రెడ్డిని ఆదివారం అరెస్టు చేసి రూ. 2.24 లక్షల విలువ చేసే నాసిరకం షర్టులను స్వాధీనం చేసుకున్నారు. లూయిస్ ఫిలిప్, అలెన్ సోలీ బ్రాండెడ్ కంపెనీల దుస్తుల ధరలు కనీసం రూ. 2 వేల నుంచి ధర ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, సత్యపాల్ వద్ద కొనుగోలు చేసిన నాసిరకం షర్టులను ఉతకగానే పీసులుగా చినిగిపోయినట్లు విచారణలో బయటపడింది.