కీసర, ఫిబ్రవరి 27: తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరొందిన కీసర గుట్ట శ్రీభవాని రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం మహా శివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య విఘ్నేశ్వర పూజతో అత్యంత వైభవోపేతంగా వేడుకలు భక్తిశ్రద్ధలతో షురూ అయ్యాయి. మొదటి రోజు పూజా కార్యక్రమాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వారికి అగ్ని ప్రతిష్టాపనము, భేరీ పూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, నీరాజన, మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్థ్ర ప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలను అత్యంత వైభోవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డిని దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. గర్భగుడిలోని శ్రీ మూల విరాట్ స్వామివారికి మంత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణ మందిరంలో ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ వారికి ఘనంగా శాలువాతో సత్కరించి వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్‌రెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన సేవలు అమోఘం: మంత్రి
భక్తులకు అన్నదానాలు చేసేవారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా గుట్టలో మూన్నురు కాపు సంఘం, ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, వంశీరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను మంత్రి మల్లారెడ్డి ఆదివారం ప్రారంభించారు.
కీసర బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు
కీసర మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 1500 మంది సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల భద్రతను సీపీ మహేష్ భగవత్, అదనపు సీపీ సుధీర్ బాబు సారథ్యంలో డీసీపీ మల్కాజిగిరి రక్షిత నేతృత్వంలో పర్యవేక్షిస్తున్నారు. 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ద్వారా కీసర రద్దీని పరిశీలించనున్నారు. మహిళా భక్తుల కోసం షీ టీమ్స్‌ను కూడా మోహరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కీసర పరిసరాలను దిగ్బంధం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పోలీసులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. డ్రోన్ పెట్రోలింగ్‌ను సైతం నిర్వహిస్తున్నారు. దీంతో రద్దీలో ప్రతి అనుమానాస్పద దృశ్యాన్ని పోలీసులు స్పష్టంగా వీక్షించనున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, వస్తువులను చూసినా వెంటనే డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ 94906 17111కు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. ఈ భద్రతను డీసీపీ మల్కాజిగిరి రక్షిత నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నారు.