కవాడిగూడ, ఫిబ్రవరి 27: తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఇందిరా పార్కు చౌరస్తాలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో తెలుగు భాషా చైతన్య సమితి, తెలుగు కూటమి, తెలంగాణ రచయితల సంఘం, లక్ష్య సాధన ఫౌండేషన్, మహిళా భారతి, గోల్కొండ సమితి, కళా సమితి, పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ, మాతృ భాష సంరక్షణ కోసం నిరంతర కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. మాతృ భాషా దినోత్సవాలు జీవనోత్సవాలు కావాలని, తల్లి భాష కోసం, తల్లి నేల కోసం ఏ స్థానంలో ఉన్నా మాతృ భాషను వదలం అని ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాతృ భాష కోసం కృషి చేసే వారిని గుర్తిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ, కవులు, భాషాభిమానులు వివిధ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో ‘తెలుగు భాషను బతికించుకుంటాం’ అనే అంశాన్ని పొందుపరిచే వరకు పోరాటం చేయాలని అన్నారు.
మాతృ భాషలో చదివిన వారికి ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు కల్పిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ భాషను పరిరక్షంచడానికి మాండలిక నిఘంటువు రావాల్సినవసరం ఉందని అన్నారు. అనంతరం, కవులు, రచయితలకు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినీదేవి, తెలుగు కూటమి అధ్యక్షుడు కోదండ రామయ్య, తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడే సాబ్, ప్రముఖ కవి గంటా మనోహర్ రెడ్డి, గోల్కొండ సాహితీ కళా సమితి అధ్యక్షుడు చంద్ర ప్రకాష్ రెడ్డి, వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నవీన్ వల్లం, తెలుగు కవితా వైభవం అధ్యక్షుడు మేక రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.