అంబర్‌పేట జోన్ బృందం, ఫిబ్రవరి 27: ఐదేండ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు విధిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డివిజన్ కార్పొరేటర్ బి. పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు రోజుల పాటు పోలియో చుక్కలు వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. సోమ, మంగళ వారాలు ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. ఇంటికి వచ్చే ఆరోగ్య సిబ్బందికి సహకరించి ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. హర్షితారెడ్డి, డా. దీప్తిపటేల్, పీహెచ్ఎన్ విజయదేవకి, డా. అనిల్‌కుమార్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మురళీకృష్ణ, లింగంగౌడ్, బుచ్చిరెడ్డి, భాస్కర్‌గౌడ్, యోబు, బంగారు శ్రీను, బీజేపీ నాయకులు చుక్క జగన్ తదితరులు పాల్గొన్నారు.
నర్సింహబస్తీలో….
నల్లకుంట డివిజన్లోని నర్సింహబస్తీ బస్తీదవాఖానలో డివిజన్ కార్పొరేటర్ వై.అమృత ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్రవంతి, బీజేపీ నాయకులు శ్యాంరాజ్, మహేశ్, మహేందర్, సుధాకర్, శ్రీనివాస్, శిరీష, ఇర్ఫాన తదితరులు పాల్గొన్నారు.
గోల్నాక : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నేటి నుంచి నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమానికి స్పందన లభించింది. ఆదివారం అంబర్‌పేట, గోల్నాక డివిజన్లలోని అన్ని కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఐదేండ్ల లోపు చిన్నారులకు చుక్కల మందును వేశారు. అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్ సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఐదేండ్ల లోపు పిల్లలకు తప్పని సరిగా పోలియోచుక్కలు వేయించాలని ఆయన కోరారు.
కాచిగూడ : పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కాచిగూడ డివిజన్లోని పలు బస్తీ, కాలనీలలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు అదివారం పల్స్ పోలియో చుక్కలను ఎమ్మెల్యే, కార్పొరేటర్, ఇతరులు వేశారు.