ఘట్కేసర్, ఫిబ్రవరి 26 : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తున్నదని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ తెలిపారు. పోచారం మున్సిపాలిటీ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం చైర్మన్ కొండల్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదన్నారు. ఇప్పటి వరకు పంచాయతీల పాలనలో ఉన్న గ్రామాలను ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం మున్సిపాలిటీలుగా ప్రకటించి, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. ప్రత్యేక నిధులు కేటాయించి మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీ, వైకుంఠధామాల అభివృద్ధి, రోడ్లు, విద్యుత్, భవనాలు, పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. పాలకవర్గాలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. 2022-2023 సంవత్సరానికి గాను రూ. 36 కోట్ల, 76లక్షల, 46వేల అంచనా బడ్జెట్‌కు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కమిషనర్ సురేశ్, కౌన్సిలర్లు మహేశ్ , ధనలక్ష్మి, రాజశేఖర్, సాయిరెడ్డి, శైలజ, హిమ, బాల్‌రెడ్డి, వెంకటేశ్ గౌడ్, లక్ష్మి, హరిప్రసాద్, రవీందర్, పోచమ్మ, సరిత, సుధాక్ష్మి, మమత, కోఆష్షన్ సభ్యులు అక్రంఅలీ, శకుంతల, శంకర్, మేనేజర్ నర్సింహులు పాల్గొన్నారు.