బోడుప్పల్, ఫిబ్రవరి 26: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ 2022-2023 బడ్జెట్ సమావేశం మేయర్ జక్క వెంకట్రెడ్డి అధ్యక్షతన శనివారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది జరిగిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని సూచించారు. రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్న పీర్జాదిగూడ నగర పాలక సంస్థను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 2022-2023వ సంవత్సరానికి గాను రూ.74 కోట్ల బడ్జెట్ను సభ ఏకగ్రీవంగా ఆమోదిందించింది. పీర్జాదిగూడ అభివృద్ధిని రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు ఆదర్శంగా తీసుకుని పని చేస్తున్నాయని ఆయన అన్నారు.
అభివృద్ధిలో మంత్రి మల్లారెడ్డిది కీలక పాత్ర: మేయర్
పీర్జాదిగూడ నగర పాలక సంస్థ రాష్ట్ర ప్రముఖులను ఆకర్షించడంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ప్రోత్సాహం ఉందని మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. నగర పరిధిలో సమీకృత వైకుంఠధామం, సమీకృత వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ పార్కు, ఎఫ్ఎస్టీపీ నిర్మాణం, పీర్జాదిగూడ నుంచి పర్వతాపూర్ వరకు నాలుగులేన్ల విస్తరణ పనులు, వరదనీటి ముంపునకు శాశ్వత పరిష్కారానికి స్ట్రోన్ వాటర్ డ్రైన్ నిర్మాణం కొరకు ఎస్ఎన్డీపీ ద్వారా రూ.110 కోట్ల నిధులు సాధించడంలో మంత్రి మల్లారెడ్డి చొరవ ఎనలేనిదని కొనియాడారు. రానున్న రోజుల్లో 24 గంటలు ఇంటింటికి తాగునీటిని అందించేందుకు 70 లక్షల లీటర్ల నీటి నిల్వలు గల ఓవర్ హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వీధి వ్యాపారుల కోసం స్ట్రీట్ వెండింగ్ జోన్ల నిర్మాణాలను చేపట్టామని, లబ్ధిదారులకు త్వరలో వాటిని అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఇండోర్ స్టేడియంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెరువులను సంరక్షించడంతో పాటు రిటర్నింగ్ వాల్స్ ఏర్పాటు చేసి సుందరీకరించనున్నట్లు వెల్లడించారు. ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, లైబ్రరీలు, డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు కో ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు.