పహాడీషరీఫ్, ఫిబ్రవరి 26: జల్పల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 3,4, 6, 15, 21,24 వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. పార్టీలకు అతీతంగా అందరం కలిసి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేద్దామన్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా డ్రైనేజీ ఔట్లెట్ సమస్య ఉందన్నారు. ఔట్లెట్ పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇటీవలే 3వ వార్డులోని కాలనీల ముంపు సమస్య పరిష్కారం కోసం రూ.10కోట్లు నిధులు కేటాయించి పనులను ప్రారంభించామన్నారు. రూ.1.70కోట్లతో రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. తాగునీటి సమస్య కోసం కోట్లాది రూపాయలతో నూతనంగా రిజార్వయ్యర్లు నిర్మించి తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మున్సిపాలిటీలో అభివృద్ధి ధ్యేయంగా శక్తి వంచనలేకుండా కృషి చేస్తానన్నారు. నీటి సమస్య పూర్తిగా త్వరలోనే తీరుతుందన్నారు. అవసరమైన నిధులు తీసుకువస్తానన్నారు. 60 గజాల లోపు ఉన్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులను త్వరగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ పర్హనా నాజ్, కమిషనర్ జీపీ కుమార్, కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు అహ్మద్ కసాడి, షేక్ పహిమిదా అఫ్జల్, జింకల రాధికాశ్రావణ్, జాఫర్బామ్, ఖాలెద్ బిన్ అబ్దుల్లా, షేక్ అలీం, నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, యంజాల జనార్దన్, షేక్ అఫ్జల్, యాస్మిన్ బేగం, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.