బంజారాహిల్స్,ఫిబ్రవరి 26: జూబ్లీహిల్స్ రోడ్ నెం 69లోని నందగిరిహిల్స్ దిగువ భాగంలో ఉన్న జీహెచ్ఎంసీ ఖాళీ స్థలంపై కబ్జాదారులు పంజావిసిరారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే… నందగిరిహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46 మధ్యలో సుమారు నాలుగు ఎకరాల జీహెచ్ఎంసీ పార్కు స్థలం ఉంది. ఈ స్థలంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46కు చెందిన పలు భవనాల యజమానులు ఆక్రమణలకు పాల్పడుతున్న విషయాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. శనివారం నందగిరిహిల్స్‌లో పర్యటించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్కు ప్రహారి గోడను కూల్చిన విషయాన్ని గమనించి లోనికి వెళ్ళారు. పార్కును ఆనుకొని ఉన్న జీహెచ్ఎంసీ ఓపెన్ ల్యాండ్‌లో భారీ ఎత్తున ఆక్రమణలు జరుగుతున్న విషయాన్ని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు, జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.
వందల కోట్ల విలువైన జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న టౌన్‌ప్లానింగ్ ఏసీపీ రాజ్‌కుమార్, యూబీడీ విభాగం మేనేజర్ బాల య్య పరిశీలన చేపట్టారు. పార్కులో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. ఎవరికి వారే అందుబాటులో ఉన్న స్థలం చుట్టూ ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసుకొని వ్యక్తిగతంగా గార్డెన్లు తయారు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు నిర్ధారించారు. పార్కుల విభాగం సూపర్వైజర్ పవన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. జీహెచ్ఎంసీ పార్కు స్థలాల్లో దామోదర్‌రెడ్డి, చైతన్య రెడ్డి అనే భవన యజమానులతో పాటు మరికొంత మంది ఆక్రమణలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు.