అమీర్‌పేట్, ఫిబ్రవరి 22 : సకల సదుపాయాలతో ఎస్ఆర్నగర్లోని నిర్మితమవుతున్న నూతన కమ్యూనిటీ హాల్‌ను త్వరగా చేపట్టి వినియోగంలోకి తీసుకురానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. రెండేండ్ల క్రితం ఈ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు ప్రారంభమైనా.. పెద్దఎత్తున బండరాయి రావడంతో నిర్మాణాలకు తీవ్ర జాప్యం జరిగిందని వివరించారు. బండరాయి తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతుండడంతో వచ్చే ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రజల వినియోగంలోకి వస్తుందని తెలిపారు. ఎస్ఆర్నగర్ హౌసింగ్ బోర్డు స్థలంలో కొనసాగుతున్న ఈ నిర్మాణ పనుల పరిశీలనకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం ఉదయం హౌసింగ్ బోర్డు అధికారులతో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. గ్రౌండ్ ఫ్లోర్లో కళ్యాణ మండపం, మొదటి అంతస్తులో డైనింగ్ హాలు ఏర్పాటవుతాయని తెలిపారు.
కమ్యూనిటీ హాల్‌కు వచ్చే వారి పార్కింగ్ కోసం రెండు సెల్లార్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 12 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ 50 పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగిందని, దీనిని 100 పడకలకు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిదన్నారు. త్వరలోనే వైద్య ఆరోగ్య మంత్రి టి.హరీష్‌రావు ఆసుపత్రిని సందర్శించేలా చూసి, త్వరితగతిన ఆసుపత్రిని 100 పడకలకు పెంచేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు సీఈ శ్రీనివాస్, ఈఈ రాధాకృష్ణ, డీఈ దశరథ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, జలమండలి సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్‌లతో పాటు ఎస్ఆర్నగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, వయోధికుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.