సికింద్రాబాద్, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చెప్పారు. సర్కారు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు కొండంత అండగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. మంగళవారం మడ్‌ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాల వద్ద కంటోన్మెంట్‌లోని తిరుమలగిరి మండలానికి చెందిన 68 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు సుమారు రూ.68లక్షల 7,888 విలువైన చెక్కులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలు వివాహాలు చేస్తే అప్పులు చేయకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ, అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
సంక్షేమ పథకాలతో సర్కారు దూసుకెళ్తుండటంతో ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయని, వారి ఉనికి కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించడంతో, ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నట్లు చెప్పారు. త్వరలోనే రసూల్‌పురాలోని నారాయణ జోపూడి సంఘంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల సాకారమవుతున్నదన్నారు. కార్యక్రమంలో తిరుమలగిరి మండల తాసీల్దార్ మాధవిరెడ్డి, ఆర్ఐ ఫ్రాన్సిస్, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, నళినికిరణ్, లోక్నాథ్లతో పాటు నేతలు నివేదిత, ముప్పిడి గోపాల్, టీఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్, దేవులపల్లి శ్రీనివాస్, సరిత, అందె శ్రీను, ధీననాథ్ యాదవ్‌తో పాటు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.