కొండాపూర్, డిసెంబర్ 9 : ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. మెట్రో రైల్ సేవలను మరింత విస్తరిస్తూ ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానం చేసేలా చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా శుక్రవారం ఐటీ కారిడార్‌లోని మైండ్‌స్పేస్ జంక్షన్లో రూ.6,250 కోట్ల వ్యయంతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర మంత్రులతో కలిసి చంఢీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శంకుస్థాపన చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించేందుకు మెట్రో సేవలు ఉపయోగకరంగా ఉంటుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా నగరంలోని అన్ని ప్రాంతాలకు మెరుగైన రవాణా సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.