శేరిలింగంపల్లి, డిసెంబర్ 9: నలగండ్ల హుడాకాలనీలో థీమ్ పార్క్ పనులు ప్రారంభమయ్యాయి. కాలనీలోని విశ్వమిత్ర, భగీరధ పేరిట అందుబాటులో ఉన్న రెండు పార్కులను ప్రత్యేకహంగులతో థీమ్ పార్క్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రధానంగా కాలనీల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పర్యావరణ ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా థీమ్ పార్క్‌లను ఏర్పాటుచేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నలగండ్ల హుడాకాలనీలో రెండు థీమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. రోజురోజుకీ కాంక్రీట్ జంగిల్‌గా మారుతన్న నగరంలో స్వచ్ఛమైన గాలీ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నగరవాసులకు అందిచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రూ. 5.80 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం
నలగండ్ల హుడాకాలనీలో ఉన్న విశ్వమిత్ర, భగీరథ పార్కులను రూ.5.80 కోట్ల వ్యయంతో థీమ్పార్క్లుగా ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ థీమ్ పార్క్ పనులకు నెలరోజుల క్రితం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. హుడాకాలనీలో దక్షిణ ప్రాంతం(సౌత్హుడా)లో 5 ఎకరాల విస్తీర్ణంలో విశ్వమిత్ర, భగీరథ పార్కులు వేర్వేరుగా విస్తరించి ఉన్నాయి. రూ.2.60 కోట్ల అంచనా వ్యయంతో విశ్వమిత్ర, రూ.3.20 కోట్ల వ్యయంతో భగీరథ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. తాజాగా వీటిని థీమ్పార్కులుగా ప్రత్యేక హంగులతో సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేలా అభివృద్ధి చేయనున్నారు. వాకింగ్‌ట్రాక్, పచ్చదనం, చిన్నారుల క్రీడాపార్కు, ఓపెన్‌జిమ్, మెడిటేషన్ సెంటర్, ఔషధ మొక్కల వనం తదితర సౌకర్యాలను ఈ థీమ్ పార్కులో భాగంగా కల్పించనున్నారు. 15రోజుల క్రితం ప్రారంభమైన ఈ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విశ్వమిత్ర, భగీరథ పార్కుల్లో జేసీబీలతో చదునుచేసే పనులు కొనసాగుతున్నాయి.
ఎమ్మెల్యే సహకారంతోనే థీమ్ పార్కులు
గోపన్‌పల్లి, ఎన్టీఆర్నగర్ కాలనీ, గోపన్‌పల్లి తండా, నలగండ్ల హుడా కాలనీ పరిసర ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల రేడియస్‌లో ఈ పార్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. హుడాకాలనీలోని విశ్వమిత్ర, భగీరథ పార్కులు ఆహ్లాదకరంగా ఈ రెండు పార్కులు తీర్చిదిద్దనున్నారు. కేవలం నలగండ్ల హుడాకాలనీ వాసులు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలు, కాలనీల వారందరికీ ఇవి ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.
– మంత్రిప్రగడ సత్యనారాయణ,హుడాకాలనీ అధ్యక్షుడు