హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 44 కాలనీల ప్రజలకు రెవెన్యూ శాఖ తీపికబురు అందించింది. నిషేధిత భూముల రెగ్యులరైజేషన్కు సంబంధించిన మార్గదర్శకాలను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) సోమవారం విడుదల చేసింది. ఆయా కాలనీలవాసులు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆరు నియోజకవర్గాల పరిధిలోని 44 కాలనీల భూములు దాదాపు 15 ఏండ్లుగా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇందులో వెయ్యి గజాల్లోపు ఉన్న భూములను రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి కేటీఆర్ గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా, మార్గదర్శకాలను విడుదల చేసింది. దాదాపు 15 వేల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా.