పహాడీషరీఫ్, డిసెంబర్ 5 : జల్పల్లి మున్సిపల్ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ వసంత తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎల్ఆర్ఎస్, ఎంజీఎఫ్ గ్రాంట్స్, ఇతర నిధుల నుంచి డ్రైనేజీ, సీసీ రోడ్డు తదితర అభివృద్ధి పనులకు రూ.2.84కోట్లతో కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలిపారు. కొంత మంది కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను లేవనెత్తారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కోట్లాది రూపాయలతో మున్సిపల్ పరిధిలో నీటి వసతుల కోసం, రోడ్లు, డ్రైనేజీ, ఔట్లెట్ సమస్యలను, మార్కెట్ల అభివృద్ధి తదితర పనులకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఇటీవలే రూ.2కోట్లతో జల్పల్లి కమాన్ రహదారి విస్తరణ అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. రూ.10కోట్ల వ్యయంతో డ్రీమ్సిటీ, మెట్రోసిటీ తదితర కాలనీల్లో ముంపు సమస్య పరిష్కారం కోసం బాక్స్ డ్రైన్ పనులు చివరిదశకు చేరుకున్నాయన్నారు. అదే విధంగా రూ.14కోట్ల వ్యయంతో క్యూబా కాలనీ నుంచి మినార్ కాలనీ, అలీనగర్, ఎర్రకుంట మీదుగా బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. షాహీన్‌నగర్ ఉస్మానియా హోటల్ ప్రధాన రహదారిలో సీసీ రోడ్డు అభివృద్ధికి రూ.66లక్షలు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పర్హానా నాజ్, మేనేజర్ మోయినుద్దీన్, ఆర్వో సుదర్శన్, టీపీవో అబీబ్ ఉన్నీసా, డీఈ వెంకన్న, ఏఈ ఆయేషా, కౌన్సిలర్లు, కో -ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు.