రవీంద్రభారతి,డిసెంబర్3 : ఇప్పటి వరకు విస్మరించబడిన గిరిజన ఆదివాసీ సాహిత్యాన్ని వెలుగులోకి తేవాల్సిన బాధ్యత మొత్తం తెలుగు సాహిత్యంపై ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. సమగ్ర గిరిజన ఆదివాసీ సాహిత్యం లేకుండా తెలుగు సాహిత్యం సమగ్ర సాహిత్యం కాదని తెలిపారు. శనివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్హాల్లో డా. సూర్యధనంజయ్, రమేశ్, కార్తీనాయక్ల సంపాదకత్వంలో వెలువడిన ’కేసులా’ గ్రంథ పరిచయ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా అడవుల సంరక్షకులుగా, పర్యావరణవేత్తలుగా, ఆరోగ్యప్రదాతలుగా, మూలిక వైద్యులుగా స్వాతంత్య్ర పోరాట సమరయోధులుగా ఇలా గిరిజన, ఆదివాసీల చరిత్ర మహోన్నతమైందన్నారు. వారి కళలు , సంస్కృతి, భాషా, వేశాధారణ తదితర విషయాల చుట్టూ వారి భాషల్లో మౌఖిక సాహిత్యంలో నిక్షిప్తమై ఉందని పేర్కొన్నారు. వారి సంస్కృతిని రికార్డు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో గిరిజన, ఆదివాసీ సాహిత్య శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆయూచితం శ్రీధర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ, సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ అధిపతి పిల్లలమర్రి రాములు, రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ సీహెచ్ ఉపేంద్ర, పి.జ్యోతి, వెంకటేశ్వరరెడ్డి, కె.పి అశోక్ పాల్గొన్నారు.