చర్లపల్లి, నవంబర్ 28 : దీపం వత్తుల తయారీ యంత్రాలు ఇప్పిస్తానని నమ్మించి.. బాధితుల వద్ద నుంచి అందిన కాడికి దోచుకున్నాడు. ఒక్కొక్కరి నుంచి దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు వసూలు చేసి పరారయ్యారు. కుషాయిగూడ ఎస్ఐ ఉపేందర్ యాదవ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏఎస్‌రావునగర్ డివిజన్ అణుపురం నివాసి రావులకొల్లు రమేశ్ (50) ఆర్ఆర్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. రమేశ్ ఆ సంస్థ ఎండీగా చలామణి అయ్యాడు. ఆ సంస్థ ద్వారా అతడు దీపం వత్తుల తయారీ యంత్రాలను ఇప్పిస్తానంటూ బాధితులకు మాయమాటలు చెప్పాడు. దీంతో రమేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు సంప్రదించారు. కొంతమందికి వత్తుల తయారీ యంత్రాలను విక్రయించాడు. వత్తుల తయారు చేసి ఇస్తే.. తిరిగి తానే కొనుగోలు చేస్తానని కూడా వ్యాపారులకు చెప్పాడు.
దీంతో కొంతమంది బాధితులు రమేశ్ వద్ద దీపం వత్తుల యంత్రాలు కొనుగొలు చేసి, వత్తులను కూడా తయారు చేసి ఇచ్చారు. కాగా, వత్తులు తయారు చేసి ఇచ్చిన వారికి డబ్బులు ఇవ్వలేదు. యంత్రాల కోసం కొంతమంది డబ్బులు ఇచ్చినా.. వారికి యంత్రాలు సరఫరా చేయలేదు. దాదాపు ఎనిమిది నెలలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. రమేశ్ వ్యవహారంపై అనుమానంతో కొంతమంది సోమవారం సంస్థ వద్దకు వచ్చి.. రమేశ్‌ను నిలదీశారు. దీంతో రమేశ్ సరైన సమాధానం చెప్పలేక.. వెనుక ద్వారం నుంచి పారిపోయాడు. మోసపోయినట్టు గ్రహించిన బాధితులు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు దాదాపు వెయ్యి మంది వరకు ఉంటారని, ప్రాథమిక సమాచారం మేరకు ఒక్కొక్కరి నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తున్నదని ఎస్ఐ చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.