సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు తయారు చేసి, వాటిని విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ముగ్గురిని అరెస్టుచేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఎల్బీనగర్లోని క్యాంప్ ఆఫీసులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలను వెల్లడించారు. ఎల్బీనగర్కు చెందిన మిర్యాల ఆనంద్‌కుమార్ (47) ఫ్లెక్సీ డిజైనర్. వ్యసనాలకు అలవాటు పడిన అతడు డబ్బు కోసం నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లను తయారు చేసి, వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే మలక్‌పేటలో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న హేమంత్‌కుమార్, సరూర్‌నగర్‌లో వీసా ప్రాసెసింగ్‌కు సంబంధించి వే-4 ఒవర్సీస్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న కళ్యాణ్ పరిచయమయ్యారు.
వీరంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అడోబ్ ఫొటోషాప్ సాయంతో అవసరమైన నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లతోపాటు ఆధార్, ఓటర్ ఐడీ కార్డు వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న హేమంత్ కుమార్ ఒక్కో సర్టిఫికెట్‌కు రూ. రెండువేల నుంచి రూ.మూడువేల వరకు ఆనంద్ కుమార్‌కు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నాడు. వాటిని అవసరమైన వ్యక్తులకు రూ.20 వేల నుంచి రూ.50వేల వరకు విక్రయిస్తున్నాడు. వీసా ప్రాసెసింగ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న కళ్యాణ్, అతడి వద్ద పనిచేస్తున్న షేక్ షహీన్ కూడా ఆనంద్‌కుమార్‌కు తక్కువ డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. తిరిగి వాటిని అవసరమైన వ్యక్తులకు ఇచ్చి, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టారు.
నిందితుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ప్రధాన నిందితుడు మిర్యాల ఆనంద్‌కుమార్‌తో పాటు వాటిని విక్రయిస్తున్న హేమంత్‌కుమార్, షేక్ షహీన్ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన పలు రకాల నకిలీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు వంటి నకిలీ డాక్యుమెంట్స్, వాటిని తయారు చేసేందుకు ఉపయోగించిన ప్రింటర్స్, కంప్యూటర్లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ ఎస్ఓటీ డిప్యూటీ కమిషనర్ కె.మురళీధర్ పర్యవేక్షణలో ఎల్బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు కలిసి జరిపిన ఈ దాడుల్లో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.