బంజారాహిల్స్: ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం ఓ నిండుప్రాణాన్ని నిలిపాయి. బంజారాహిల్స్‌లో జీవీకే సర్కిల్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ ఫ్యూజ్ బాక్స్‌లో చేతులు పెట్టి కరెంటు షాక్‌కు గరై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ బోళాశంకర్ కార్డియోపల్మనరీ రీసస్కిటేషన్ చేసి అపస్మార స్థితి నుంచి రక్షించి దవాఖానకు తరలించారు.బంజారాహిల్స్, నవంబర్ 22: కరెంట్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలను సీపీఆర్ ద్వారా ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడాడు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా నుంచి జీవీకే సర్కిల్‌కు వెళ్లే రోడ్డు ఫుట్‌పాత్ పక్కన ఎలక్ట్రిక్ ఫ్యూజ్ బాక్స్ ఉంది. మంగళవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఫ్యూజ్‌బాక్స్ తెరిచి.. లోపల చేతులు పెట్టాడు.
దీంతో అతడికి కరెంట్ షాక్ తగలడంతో చేతులు, కాళ్లకు మంటలంటుకున్నాయి. కరెంట్ షాక్‌కు గురైన అతడు రోడ్డుపై పడిపోవడంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ బోళా శంకర్ గమనించి అతడి వద్దకు వెళ్లాడు. అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన సీపీఆర్ ( కార్డియోపల్మనరీ రీసస్కిటేషన్) చేశాడు. దీంతో అపస్మారక స్థితిలో నుంచి బయటకు వచ్చిన అతడిని 108 సాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని సీపీఆర్ ద్వారా కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహరాజుతో పాటు అధికారులు అభినందించారు.