సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ):ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులతో ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం.. ఫ్యాషన్ డిజైనింగ్, క్రాఫ్ట్ వైపు యువత మొగ్గు చూపుతున్నారు. దీనంతటికీ ఫ్యాషన్ డిజైనింగ్‌లో మంచి భవిష్యత్‌తో పాటు భారీ వార్షిక ప్యాకేజీలు అందించడం కూడా ఓ కారణం. ఫ్యాషన్ డిజైన్ రంగం పై విద్యార్థుల్లో అవగాహన పెరుగుతున్నది. సంప్రదాయ రంగాల్లో ఉండలేని వారు విభిన్నమైన అంశాల్లో రాణించాలనే పట్టుదలతో ఈ రంగాన్ని ఎంచుకుంటున్నట్లు హైదరాబాద్ నిఫ్ట్ సీసీ ప్రతినిధి కిశోర్‌చంద్ర తెలిపారు.
మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్..
ప్రపంచంలో రోజురోజుకు ఫ్యాషన్ ట్రెండ్ మారుతున్నది. మారుతున్న ట్రెండ్‌తో పాటే మనం మారాలని నేటితరం యువత, నగర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం యువత ఫ్యాషన్ రంగంపై ఎకువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎలాంటి బట్టలు కొన్నా ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. దీంతో ఫ్యాషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఫ్యాషన్ డిజైనర్లకు మారెట్లో డిమాండ్ కూడా పెరుగుతున్నది. ప్రస్తుతం అకాడమిక్ రంగంలో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా స్థానం సంపాదించుకున్నది. ఫ్యాషన్ రంగం వేగంగా పుంజుకుంటున్నదని నిపుణులు
చెబుతున్నారు.
కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు..
యూజీ స్థాయిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే యువత ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మారులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశానికి (నిఫ్ట్) వంటి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడానికి విద్యార్థులు ఎన్ఐడీ, డీఏటీ, యూసీఈఈడీ కలిగి ఉండాలి. ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేస్తున్న అభ్యర్థి కనీస వయస్సు 19 నుంచి గరిష్టంగా 40 ఏండ్లు మించరాదు.
ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సులు..
ఫ్యాషన్ డిజైనింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులు చేయవచ్చు. ఆయా ఇనిస్టిట్యూట్స్‌లో వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల కాలవ్యవధి కూడా భిన్నంగా ఉంటుంది. ఈ కోర్సులు 1 నుంచి 4 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
హైదరాబాద్ నిఫ్ట్ అందజేస్తున్న యూజీ కోర్సులు..
ఇక హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఆధ్వర్యంలో యూజీ ప్రోగ్రామ్స్ ఈ విధంగా ఉన్నాయి. 1.ఫ్యాషన్ డిజైనింగ్, 2 ఫ్యాషన్ కమ్యూనికేషన్, 3.యాక్సెసరీ డిజైన్, 4.టెక్స్టైల్స్ డిజైన్, 5.నీట్ వేర్ డిజైన్, 6.బ్యాచ్‌లర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందజేస్తున్నది. దీంతోపాటు మాస్టర్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సును సైతం కొనసాగిస్తున్నది.