ఖైరతాబాద్,నవంబర్20 : రాజకీయాల్లో రాణించడం కష్టమని సినీనటుడు చిరంజీవి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెస్ట్ గోదావరి జిల్లా నరసాపూర్ శ్రీఎర్రమిల్లి నారాయణ మూర్తి కళాశాల (వైఎన్ఎం) పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అధ్యాపకులతో కలిసి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులను సన్మానించారు. అనంతరం జ్ఞాపకాల దొంతర అనే సావనీర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు. అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ… రాజకీయాల్లో అనడం, అనిపించుకోవడం ఉంటుందని ప్రస్తుత రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమన్నారు. ఒకదశలో నాకు రాజకీయాలు అవసరమా అనిపించిందని చెప్పారు. రాజకీయాలకు పవన్ తగిన వాడని.. ఏదోఒక రోజు ఉన్నత స్థాయిలో చూస్తామన్నారు. కాలేజీ చదువుకునే రోజుల్లోనే మన లక్ష్యం ప్రకారం ముందుకు సాగాలని, మనం ఏమి అవుతామో అక్కడే బీజం పడుతుందన్నారు. నాకు నటన పట్ల ఇష్టం ఉండటంతో కళాశాలలో రాజీనామా అనే నాటకంలో నటిస్తే ఉత్తమ నటుడు అవార్డు వచ్చిందని తెలిపారు. అప్పుడే నాకు ఫ్యాన్స్ మొదలయ్యారన్నారు. ఎన్సీసీలో సీనియర్ కెప్టెన్ పొజిషన్ వరకు వెళ్లానని, 1976లో రిపబ్లిక్ డే సందర్భంగా క్యాంప్‌కు వెళ్లి ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్‌పథ్‌లో మార్చింగ్ చేశానని చెప్పారు. కేవలం పుస్తకాల నుంచే కాకుండా మన చుట్టూ ఉండేవారి నుంచి నేర్చుకుంటూనే ఉండాలని చిరంజీవి సూచించారు. ఈ సందర్భంగా ఇంజినీర్ జీఎల్ రావు, జస్టిస్ భవానీ ప్రసాద్, బీఎస్ఆర్ వర్మ, డాక్టర్ బీవీ సుబ్బారావులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏపీ మండలి మాజీ చైర్మన్ షరీఫ్, లెక్చరర్ ఎర్రమెల్లి సూర్యనారాయణ, ఐపీఎస్ అధికారి మధుసూదన్, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు, మధుకర్, అనీల్‌కుమార్, డాక్టర్ పీఎస్ వర్మ , కళాశాలలో చదువుకుని హైదరాబాద్‌లో స్థిరపడ్డ పలువురు పాల్గొన్నారు.