సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ప్రీమియర్ లీగ్ కార్ రేసింగ్‌లో నగరంలోని హిమాయత్‌నగర్‌కు చెందిన యువకుడు ధృవ పాల్గొన్నాడు. ఇప్పటికే పలు ఈవెంట్లలో పాల్గొన్న ధృవ.. ప్రస్తుతం నగరంలో జరిగిన ఈవెంట్లో తన కార్ నంబర్-15తో పాల్గొని అందరినీ అలరించాడు. తనకు ఈ ఈవెంట్ ఎంతో గొప్ప అనుభూతినిచ్చిందని అన్నారు. మన సొంతగడ్డపై రేసింగ్ నిర్వహించడం, తనకు పాల్గొనే అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్య ఎంతో ఉత్సాహంగా రేస్‌లో పాల్గొన్నానని ధృవ చెబుతున్నాడు.
నమస్తే: సొంతగడ్డపై మీరు రేస్‌లో పాల్గొనడం ఎలా అనిపించింది?
రేసర్: సొంతగడ్డపై రేసింగ్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. అదికూడా మన తెలుగు వారి మధ్య నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య నేను రేస్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇచ్చింది.
నమస్తే: ఇంతకు ముందు ఏయే విభాగాల్లో పాలుపంచుకున్నారు?
రేసర్: నోవీస్ కప్ నేషనల్ ఛాంపియన్షిప్ 2021 (కోయంబతూర్), రెబుల్ కార్ట్ ఫైట్ ఇండియా-2021 (గుజరాత్), ఆటోక్రాస్ ఛాంపియన్షిప్ (శంషాబాద్), గోకార్టింగ్ టాలెంట్ హంట్ శామీర్‌పేట్ ఈవెంట్లలో పాల్గొన్నాను.
నమస్తే: హైదరాబాద్‌లో కార్ రేసింగ్ నిర్వహించడంపై మీ అభిప్రాయం ఏమిటి?
రేసర్: మన నగరంలో స్ట్రీట్ రేసింగ్ నిర్వహించడం దేశంలో మొదటిసారి. రేసింగ్ విషయంలో ఇదొక పెద్ద ముందడుగు. రేసింగ్‌లో పాల్గొనే యువతకు ఓ స్ఫూర్తిగా నిలిచింది. ఇకముందు ఎంతో ఉత్సాహంతో రేస్‌లో పాల్గొనేందుకు యువత ముందుకువచ్చే వీలుంది.
నమస్తే: ప్రస్తుత ఈవెంట్లో మీ ప్రదర్శన ఎలా ఉంది. మీ అభిరుచులేంటి?
రేసర్: అద్భుతంగా అనిపించింది. నా చుట్టూ ఉండే ప్రజల మధ్య డ్రైవింగ్ చేయడం సూపర్‌గా అనిపించింది. ప్రస్తుతం నేను చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్లో కామర్స్ చదువుతున్నాను. డ్రైవింగ్ సిమ్యులేటర్లు, ఎఫ్1 చూడటం నాకు ఎక్కువగా ఇష్టం. ఇంకా రాబోయే రోజుల్లో అనేక ఈవెంట్లలో పాల్గొనాలని ఉంది.