సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): నగరం ‘ఫార్ములా’ మేనియాతో ఓలలాడింది.. సాగర తీరం.. సందడిగా మారింది. హుస్సేన్ సాగర్ చెంత శనివారం ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. 2.8 కి.మీ ఉన్న ట్రాక్‌పై 240 కి.మీ వేగంతో 40 నిమిషాల పాటు 12 రేసింగ్ కార్లు రయ్య్‌మ్రంటూ దూసుకెళ్లాయి. ఐమ్యాక్స్ కూడలి నుంచి మొదలైన క్వాలిఫైయింగ్ రేస్‌ను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించి.. పోటీలను తిలకించారు.
సాగర తీరం రేసింగ్ కార్ల పోటీలతో దద్దరిల్లింది. గంటకు 240 కి.మీ వేగంతో దూసుకెళ్తూ ప్రేక్షలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. శనివారం భాగ్యనగరం నడిడొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో మొట్ట మొదటిసారిగా ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) అట్టహాసంగా ప్రారంభమైంది. ఐమ్యాక్స్ కూడలి నుంచి ప్రారంభమైన కార్ రేసింగ్ లీగ్ క్వాలిఫియర్ను ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌లోనే మొట్ట మొదటిసారిగా జరుగుతున్న పోటీలు కావడంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాట్లను చేశారు. పోటీలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా 2.8కి.మీ పొడవునా ఉన్న ట్రాక్ చుట్టూ ఫ్రీకాస్ట్ డివైర్లు, వాటిపై ఎత్తయిన ఇనుప కంచెతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
రెప్పపాటులో..
“ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపు తీగ..!” ఈ సినిమా డైలాగ్ అచ్చం కార్ రేసింగ్ పోటీల్లో సందర్శకుల నోళ్లల్లో మెదిలింది. ఎందుకంటారా.. 240 కి.మీ.వేగంతో రేసింగ్ కార్లు దూసుకుపోతుంటే వాటిని సందర్శకులు తమ మొబైల్స్‌లో బంధించేందుకు ఆసక్తి చూపారు. అయితే వాటి వేగం రెప్ప వాల్చేలోపే స్థానాన్ని మార్చుకోవడంతో ఫొటోలు తీయడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెప్పపాటులో కార్లన్నీ వెళ్లిపోగా.. మళ్లీ వాటికోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. మళ్లీ అవి వచ్చి నిమిషంలోనే వ్యూ నుంచి దాటిపోతాయి. దీంతో చాలా మంది సందర్శకులు చేసేదేమి లేక రేసింగ్ వీడియోలను తీశారు. పోటీలు ముగిసిన తర్వాత రేసింగ్ కార్లతో సెల్ఫీలు దిగి సందడి చేశారు.
6 ప్రత్యేక టీంలు.. 47 సీసీ కెమెరాలు
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొదటి రోజు హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది. రేస్ కార్ల కదలికలను నిశితంగా గమనించి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు 6 ప్రత్యేక టీంలు పనిచేశాయి. 2.8 కిలో మీటర్ల ట్రాక్ మేరకు చుట్టూతా 47 కెమెరాలను అమర్చారు. కార్ల రాకపోకలు, వేగం ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ పొజిషన్స్ కేటాయించారు. ఏదైనా కారు వేగం తగ్గడం.. సాంకేతిక లోపం తలెత్తడం..డ్రైవర్ ఇబ్బందికి గురవడం.. మూలమలుపుల వద్ద పల్టీలు కొట్టే ప్రమాదం ఏర్పడటం..కార్లు ఢీకొట్టడం లాంటి సమస్యలు తలెత్తితే వాటిని స్క్రీన్లపై పర్యవేక్షించి సదరు వాహనాలను రిస్క్య్ చేస్తారు. అందుకోసం మెడికల్ ఎమర్జెన్సీ టీంలు, ఫైర్ సేఫ్టీ టీంలు, వాహనాన్ని సెకన్లల్లో ట్రాక్ నుంచి పక్కకు తీసుకెళ్లే వ్యవస్థలను ఏర్పాటు చేశారు. సాంకేతిక టీంలు రిస్క్యూ టీంలతో వాకీటాకీలతో ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంటారు. అనుకోని ఇబ్బంది తలెత్తితే వెంటనే ట్రాక్‌పై వస్తున్న కార్లకు సిగ్నల్స్ ఇస్తుంటారు. అందుకోసం ఎరుపు, పసుపు జెండాలను అమర్చారు. అంతేకాదు ట్రాక్ చుట్టూతా మూలమలుపుల వద్ద పదుల సంఖ్యలో లారీ టైర్లతో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఏదైనా కారు వేగం నియంత్రించుకోలేకపోతే సదరు వాహనం నేరుగా ఆ టైర్లను ఢీకొట్టినా ప్రమాదం పెద్దగా లేకుండా ఉండేందుకు టైర్ల వ్యవస్థ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. రేసింగ్‌లో పాల్గొన్న కార్లలో మూడు కార్లకు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే రెండు వాహనాలు ట్రాక్ నుంచి తప్పించగా మరో వాహనాన్ని మరమ్మతులు చేసి ట్రాక్‌లో నిలిపారు.
విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడిని అభినందించిన మంత్రి కేటీఆర్..
ఇండియన్ కార్ రేసింగ్‌లో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. అంతకుముందు మంత్రి నిర్వాహకులు, రేసింగ్‌లో పాల్గొంటున్న డ్రైవర్లను కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్..
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన రేసింగ్ ట్రాక్‌ను, గ్యాలరీని, ఇతర నిర్మాణాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మంత్రి వెంట హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బీ.ఎం. సంతోష్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ పరంజ్యోతి, ప్లానింగ్ అధికారి గంగాధర్ ఉన్నారు.
హైదరాబాద్‌ను కొట్టే సిటీ లేదు.. కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
రేసింగ్ చూస్తుంటే చాలా ఎైగ్జెటింగ్గా..చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మార్చిన తెలంగాణ ప్రభుత్వానికి థాంక్యూ చెబుతున్నాను. స్పోర్ట్స్‌ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. తప్పకుండా హైదరాబాద్ టీం గెలవాలని కోరుకుంటున్నా. మంత్రి కేటీఆర్‌కు థాంక్యూ. ప్రపంచంలో మన హైదరాబాద్‌ను కొట్టే సిటీ లేదు. ఆ మేరకు ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. హైదరాబాద్ వేదికగా అనేక సమ్మిట్లు, మూవీ ఫంక్షన్లు ఇలా ఎన్నో అత్యాధునికంగా జరుగుతున్నాయి. మనం హైదరాబాదీలుగా గర్వపడాలి. ఏ దేశంలో వెళ్లినా మళ్లీ హైదరాబాద్ తిరుగొస్తే ఆ భావన చాలా గొప్పగా ఉంటుంది.
రేసింగ్‌లో ఉండే కిక్కే వేరు
నేను చాలా రేసింగ్ పోటీలు వీక్షించాను. హైదరాబాద్ వేదికగా ఇప్పుడు రేసింగ్ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ హిస్టరీలో హైదరాబాద్ ఇకమీదట చరిత్ర సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ఇలానే పోటీలు సాగితే 5,6ఏండ్లల్లో హైదరాబాద్ టీంల ప్రతిభ ప్రపంచానికి పాకుతుంది. రేసింగ్ పోటీల ఆవశ్యకతను గుర్తించి ఏర్పాటు చేయడం గొప్ప విషయం. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
రేసింగ్ కార్ల పరుగులు ఇలా..
సాగర్ తీరంలో 2.8 కి.మీ పొడవునా ఫార్ములా రేసింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ట్రాక్‌ను నిర్వహించారు. ఐమ్యాక్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే ప్రాంతంలో లీగ్ ప్రారంభమయ్యే చోట ప్రత్యేకంగా మార్కింగ్ చేశారు. ఇక్కడ ప్రారంభమయ్యే కార్లు రేసింగ్ ట్రాక్ చుట్టూ నిర్ణీత సమయంలో తిరిగి, వారికి నిర్ణయించిన ప్రాంతాలకు చేరుకునేలా స్టాపింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నగరం అద్భుతం..
కారు రేసింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాను. నగరం అద్భుతంగా ఉంది. రేసింగ్ కోసం కొత్తగా రూపొందించిన ట్రాకింగ్‌పై రేసింగ్ ఉత్సాహానిచ్చింది. ఇతర కార్లతో పోటీపడుతూ హైదరాబాద్ స్ట్రీట్ సర్కూట్పై కారు నడపడం సరికొత్త అనుభూతినిచ్చింది. నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కార్ల రేసింగ్ కోసం హైదరాబాద్ సరైన నగరం. తరువాత జరిగే పోటీల్లోనూ ఇదే ఉత్సాహాంతో పోటీలో పాల్గొంటాను.
కార్ రేస్.. యూత్ జోష్ వీక్షకులతో కిక్కిరిసిన తెలుగుతల్లి ఫ్లైఓవర్ ప్రాంతాలు
రయ్.. రయ్‌మంటూ కార్ల రేసింగ్‌తో సాగరతీరం మార్మోగింది. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో స్ట్రీట్ రేసింగ్ వీక్షకులకు కనువిందు చేసింది. రేసింగ్ సమయంలో సందర్శకులతో తెలుగుతల్లి ఫ్లైఓవర్ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. దీంతో పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఎప్పుడు రియల్‌గా చూడని రేసింగ్‌ను సందర్శకులు నేడు ప్రత్యక్షంగా చూసి ఎంతో ఆస్వాదించారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.
వరల్డ్ క్లాస్ సిటీగా గుర్తింపు..
ఇక్కడి వాతావరణం చూస్తుంటే హైదరాబాద్‌లో గాకుండా ఎక్కడో బయటి దేశాల్లో ఉన్నట్లు ఉంది. కార్ల రేసింగ్ అంటే పెద్ద పెద్ద నగరాల్లో జరిగేది. ఇప్పటికే హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అనేక రంగాల్లో పేరుగాంచింది. కార్ రేసింగ్ నిర్వహణ రంగంలో కూడా ప్రపంచస్థాయి నగరాల సరసన చేరింది. ఇలాంటి ఈవెంట్లు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి.
–రావుల శ్రీధర్‌రెడ్డి, విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్
కేటీఆర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
అస్సలు రేసింగ్ పోటీలు ఇక్కడ జరుగుతాయని ఊహించలేదు. ఆ స్థాయిలో ఆలోచనలు చేసే నాయకులు ఉంటారా అనే సందేహం ఉండేది. పదేండ్ల కిందట నేను కోల్‌కతాలో రేసింగ్ పోటీలు వీక్షించాను. నాకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా రేసింగ్ పోటీలు జరగడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా మంత్రి కేటీఆర్ చొరవకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఏర్పాట్లు బాగా చేశారు.
– సంగీత, సందర్శకురాలు
హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో
ఈ రేసింగ్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఘడించింది. చాలా మంది టీవీల్లో చూడటం తప్పా నేరుగా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు కండ్లముందు జరుగుతున్న రేసింగ్‌ను చూస్తూ ఎంతో ఆస్వాదించాం. మంత్రి కేటీఆర్ చొరవతో రేసింగ్ ఈవెంట్ జరిగినట్లు విన్నాను. చాలా బాగుంది.
–అరవింద్, ఈసీఐఎల్