కందుకూరు, నవంబర్ 19 : ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఇలా సమయం ఏదైనా కావచ్చు. స్నేహితులు కలిసినా.. బంధువులతో ముచ్చటిస్తున్నా.. ముందు గుర్తొచ్చేది చాయ్. ఒక్కప్పుడు చాయ్ ఇవ్వండి అనే వారు.. ఇప్పుడు ధమ్ చాయ్, అల్లం టీ, అశ్వగంధ టీ అంటూ ఎన్నో పేర్లు చెప్పేస్తున్నారు. అందుకు తగ్గట్టే టీ స్టాళ్లు కూడా వెలుసున్నాయి. ఎన్నో పేర్లు.. మరెన్నో రుచులతో ప్రజల చెంతకు చేరుతున్నాయి. ఒకప్పుడు నగరంలోని ప్రధాన ప్రాంతాలకు పరిమితమైన టీ స్టాళ్లు, ఇప్పుడు శివారుకు కూడా చేరుకున్నాయి. భిన్నమైన పేర్లతో ఆకట్టుకుంటున్నాయి. యువతకు స్వయం ఉపాధికి తోడుగా నిలుస్తున్నాయి.
స్వయం ఉపాధి దొరికింది..
టీ స్టాల్‌తో స్వయం ఉపాధి దొరికింది. ప్రత్యేకంగా కొత్త టేస్ట్‌తో టీలు విక్రయిస్తున్నాం. ఇవి అందరికీ నచ్చుతున్నాయి.. గిరాకీ బాగుంది. వివిధ రకాల టీలను విక్రయిస్తున్నాం. టీ తాగే వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. యువత తమ కాళ్లపై నిలబడేందుకు టీ స్టాళ్లు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి.
– తల్లోజు మాధవాచారి, టీ స్టాల్ కందుకూరు
అల్లం చాయ్ నుంచి ధమ్ చాయ్ దాక..
అల్లం చాయ్, బాదం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, ఇలాచి టీ, బెల్లం టీ, పెప్పర్ టీ, బ్లాక్ టీ, జింజర్ టీ, లెమన్ టీ, బెల్లం పెప్పర్ టీ, మసాలా టీ, అంటూ ఎన్నో విభిన్న రుచుల్లో టీలు ఆయా స్టాళ్లలో అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఆయా ఫ్రాంచైజీలు స్పెషల్ టీలు అదనం. వాతావరణానికి తగ్గట్టు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా టీ ప్రియులు సైతం కొత్త రుచుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతున్నాయనే ప్రచారంతో అశ్వగంధ టీ, కొరియన్ టీ, జిన్ సెన్ టీతో పాటు పలు వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు సమోసాలు, బిస్కెట్లు, ఎగ్ పఫ్‌లు, మిల్క్ షేక్‌లు సైతం విక్రయిస్తున్నారు.
మంచి గిరాకీ ఉంది..
టీ స్టాల్లో మంచి గిరాకీ ఉంది. టీ స్టాల్‌ను ఏర్పాటు చేసి నడుపుతున్న గిరాకీ ఎక్కువ పెరిగింది. దాదాపు 400మందికి పైగా విక్రయిస్తాం. చాయ్ ప్రియులు కూడా భిన్నమైన రుచులకు టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్టే మేం ఏర్పాట్లు చేస్తున్నాం.
– రమేశ్, టీ స్టాల్ నిర్వాహకుడు కొత్తూరు వాగు శ్రీశైలం జాతీయ రహదారి