సిటీ బ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన టీఎస్‌బీపాస్ అత్యంత మెరుగైన పనితీరును కనబరిచింది. గురువారం నానక్‌రామ్‌గూడలో టీఎస్ బీపాస్ రెండవ వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నానక్‌రామ్‌గూడ హెచ్‌డీసీఎల్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ రంగానికి సంబంధించిన అనుమతుల విషయంలో టీఎస్ బీపాస్‌తో ఎంతో మెరుగైన పనితీరును కనబడుతుందని, ఇందులో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. టీఎస్ బీపాస్‌ను విజయవంతంగా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను ప్రశంసించి మెమెంటోలను అందజేశారు. మున్ముందు ఇదే విధమైన పనితీరును కనబరిచి త్వరితగతిన భవన నిర్మాణాల కోసం అనుమతులను జారీ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌బీపాస్ సిబ్బంది పాల్గొన్నారు.