సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) :సోషల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులకు వేగంగా స్పందిస్తుంటారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుంటారు. తాజాగా బాలల దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్ గోల్డెన్సిటీ కాలనీ(పిల్లర్నం. 248)కి చెందిన ఉమర్ అనే బాలుడు తమ కాలనీలో నెలకొన్న నీటి సమస్యను ప్లకార్డు పట్టుకొని.. మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చాడు. ఆ వీడియోను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేయగా, ఆయన వెంటనే స్పందించారు. కాలనీకి వెళ్లి సమస్య పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిశోర్‌ను ఆదేశించారు. ఉమర్‌తో పాటు కాలనీవాసులను కలిసిన దానకిశోర్.. నాలుగు గంటల్లోనే సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపారు. వర్షాకాలం దృష్ట్యా నిలిచిపోయిన రూ. 2.85 కోట్ల పైప్‌లైన్ పనులు రెండు వారాల్లో పూర్తి చేసి..మంచి నీరు సరఫరా చేస్తామని హామీ ఇస్తూ.. అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని భరోసా ఇచ్చారు.
తమ కాలనీకి నల్లా నీరు సరఫరా చేయాలని ఓ బాలుడు ట్వీట్ ద్వారా చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. అధికారులను ఆగమేఘాల మీద కాలనీకి పంపించి నీటి సమస్యను పరిష్కరింపచేశారు. తాము రాజేంద్రనగర్ గోల్డెన్ సిటీ కాలనీలోని ఫిల్లర్ నంబర్ 248 సమీపంలో నివసిస్తున్నామని, తమకు నల్లా నీటి సరఫరా లేక ఇబ్బంది పడుతున్నామని ఉమర్ అనే బాలుడు తమ సమస్యను ఒక ప్లకార్డు పట్టుకొని విజ్ఞప్తి చేస్తున్న వీడియోను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఇది గమనించిన మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. బాలుడు నివసించే కాలనీకి ప్రత్యక్షంగా వెళ్లి సమస్యను పరిషరించాలని జలమండలి ఎండీ దానకిశోర్‌ను ఆదేశించారు. దీంతో దానకిశోర్ వెంటనే గోల్డెన్ సిటీ కాలనీలో పర్యటించారు. బాలుడు ఉమర్‌తో పాటు కాలనీవాసుల సమస్యను తెలుసుకున్నారు.
రెండు వారాల్లో పనులు పూర్తి
కాలనీకి నల్లా పైప్‌లైన్ వేయడానికి జలమండలి రూ.2.85 కోట్లను మంజూరు చేసింది. అయితే, వర్షాకాల జాగ్రత్తల్లో భాగంగా అక్టోబర్ 31 వరకు రోడ్లు తవ్వడానికి వీలు లేకుండా జీహెచ్ఎంసీ నిషేదాజ్ఞలు ఉన్నాయి. దీంతో పైప్‌లైన్ ఏర్పాటు పనులు ఆలస్యం అయ్యాయి. ఈ విషయాన్ని జలమండలి ఎండీ దాన కిశోర్.. గోల్డెన్ సిటీ కాలనీవాసులకు వివరించారు. రెండు వారాల్లో పైపులైన్ పనులు పూర్తిచేసి నల్లా ద్వారా మంచినీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా కాలనీకి నీటి సరఫరా కొనసాగిస్తామని తెలిపారు. బాలుడు ఉమర్ తమ కాలనీ నీటి సమస్యను వెల్లడించిన నాలుగు గంటల్లోపే మంత్రి కేటీఆర్ స్పందించడం, జలమండలి ఎండీ దానకిశోర్ నేరుగా గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి సమస్య పరిషారానికి హామీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో జలమండలి ఎండీ దాన కిశోర్‌ను మంత్రి కేటీఆర్ అభినందిస్తూ మరో ట్వీట్ చేశారు.