సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): దళితబంధు రెండో విడత అర్హుల లబ్ధిదారుల వివరాలను నాలుగు రోజుల్లో అందజేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలకు సూచించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో నగర ఎమ్మెల్యేలు, అధికారులతో దళిత బంధు, ఆసరా పెన్షన్లపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మొదటి విడతలో 1484 మంది అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. రెండో విడతలో ఒకో నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం 500 చొప్పున అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు చెప్పారు. నాలుగు రోజుల్లో అర్హులైన వారి దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందించేలా చూడాలని ఎమ్మెల్యేలను మంత్రి కోరారు. లబ్ధిదారులకు ఆసక్తి కలిగిన రంగాల్లో అవసరమైన శిక్షణను అందించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. లబ్ధిదారుల వివరాలు, యూనిట్లు తదితర సమాచారంతో నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా నివేదికలను రూపొందించి ఎమ్మెల్యేలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్‌ను మంత్రి ఆదేశించారు.
వారం రోజుల్లో పెన్షన్ కార్డుల పంపిణీ పూర్తి
ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీని వారం రోజుల్లో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ప్రభుత్వం ఆగస్టు 15న హైదరాబాద్ జిల్లాకు 80,824 నూతన పెన్షన్లను మంజూరు చేసిందని చెప్పారు. అయితే ఇప్పటి వరకు 74,231 గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వివరించారు. మిగిలిన 5933 గుర్తింపు కార్డుల పంపిణీని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సాయన్న, కౌసర్ మొయినుద్దీన్, మౌజం ఖాన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, ఆర్డీఓలు వసంత, వెంకటేశ్వరరావు, పలువురు తసీల్దార్లు పాల్గొన్నారు.