“కూర్చున్న చోటనే శత్రువులనుతుదముట్టించగలం.. క్షిపణులతో బాంబులు కురిపించగలం.. రేస్‌లతో వాహనాలను చక్కర్లు కొట్టించగలం..ప్రత్యర్థి దేశాలను ఓడించి విజయకేతనం ఎగురవేయగలం.. రహస్యాలను ఛేదించి పద్మవ్యూహాల నుంచి బయటపడగలం..” ఇటువంటి అనుభూతులను పంచే అద్భుతం ‘వీఆర్'(వర్చువల్ రియాల్టీ).
సిటీబ్యూరో, నవంబర్ 9 ( నమస్తే తెలంగాణ ): గ్రేటర్లో వర్చువల్ రియాల్టీకి డిమాండ్ పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు వీఆర్ గేమింగ్‌లో మునిగిపోతున్నారు. వీఆర్ గేమింగ్ వృద్ధిని దృష్టిలో పెట్టుకున్న సంస్థలు మాల్స్ల్లో గేమింగ్ జోన్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. విభిన్న అనుభూతులను పంచే వీఆర్ గేమ్స్‌ను సరికొత్తగా రూపొందిస్తూ గేమర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సగటున ఒక చిన్న మాల్లో గేమింగ్‌పై ఆదాయం ఏడాదికి రూ.3 కోట్లు కాగా, పెద్ద మాల్లో రూ. 7 కోట్లకు పైగా వ్యాపారం సాగుతున్నట్టు యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్, యానిమేషన్ సేవలకు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. ఇక్కడి మానవ వనరులు, వ్యాపారం, మైండ్ పవర్ తదితర వనరులు పుష్కలంగా ఉండటమే కారణంగా గేమింగ్ సంస్థలు చెబుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ద వరల్డ్ లార్జెస్ట్ డిజిటల్ ఫెస్టివల్లో ప్రముఖ గేమింగ్ కంపెనీలు తమ సరికొత్త వీఆర్ గేమ్‌లను ప్రారంభించడం విశేషం. శంషాబాద్, గచ్చిబౌలీ, నెక్లెస్‌రోడ్డు, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, కొండాపూర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్య లో గేమింగ్ జోన్లు ఉన్నాయి. గ్రేట ర్ పరిధిలో గేమింగ్ జోన్ ఖాతాలో సుమారు ఏడాదికి 200 కోట్లకు పైగా ఆదాయం చేరుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఉపాధి అదే స్థాయిలో..!
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక సినిమాలు, గేమింగ్, కార్టూన్ల రూపకల్పన హైదరాబాద్ వేదికగా మారుతుండటంతో ఉపాధి అవకాశాలకు అదే స్థాయిలో డిమండ్ ఏర్పడింది. గేమింగ్, వీఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాల్లో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఇంటర్, డిగ్రీ చదువుతోనే రూ.లక్షల్లో ప్యాకేజీలు ఇస్తుండటంతో ఉన్నత విద్య అభ్యసించినవారు కూడా ఆశ్చర్యపోతున్నారు. గేమింగ్ డెవలపర్స్, గ్రాఫిక్ డిజైన్, మీడియా టెక్నాలజీ, వీర్ కాన్సెప్ట్స్, గేమ్ థియరీ, ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ తదితర రంగాల్లో మానవ వనరులకు డిమాండ్ ఏర్పడింది. ఒక్కో కంపెనీ ఏటా వివిధ కంపెనీలో నైపుణ్యం ఉన్న 800-1000 మంది కావాలని అడుగుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి.
వీఆర్ గేమ్స్ ఇవే..
రోలర్ కోస్టర్ గేమ్, బీట్స్బెర్, క్రీడ్ రెయిస్ టు ద గ్లోరీ, క్రికెట్ క్లబ్, బ్లేడ్ అండ్ సోర్సేరీ, లోన్ఎకో, యాక్షన్ షూటర్స్, పజిల్ బేస్డ్, హర్రర్ గేమ్స్, ద ట్రిప్, రోబో రుంబుల్, కాల్ ఆఫ్ డ్యూటీ డబ్ల్యూడబ్ల్యూఐ, ఎస్కేప్ వాక్, టెక్కెన్7, వాక్ ఏ బ్యాట్, ప్రాకెజ్ట్ కార్స్2, ఫ్లైమాక్స్, ఫింగర్ కోస్టర్, జురాసిక్ ఎస్కేప్, ఎక్స్2 రేసింగ్, వెర్టిగో, వెల్కాన్ గన్, ఆర్ట్ ఆఫ్ అటాక్, జోంబియె సర్వైవల్, ఇంజినీరియం, సింగ్యులారిటీ, ఔట్‌బ్రేక్ ఆరిజిన్స్, ఫ్లైట్ సిమ్యులేటర్, స్ప్లాష్ కోస్టర్, రియల్ స్కోడ కార్ సిమ్యూలేటర్, పిస్టోల్ విప్, బౌలింగ్, డ్యాన్స్ సెంట్రల్ తదితర గేమ్స్.
వీఆర్ పరికరాలకొనుగోలు పెరిగింది
గేమింగ్ జోన్స్‌కు వెళ్లడం ఇటీవల చాలా పెరిగింది. వర్చువల్ రియాల్టీ గేమ్స్‌కు ఆదరణ పెరిగింది. పిల్లల అభిరుచులను గమనించి కొందరు తల్లిండ్రులు వీఆర్ గేమింగ్ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. చైనా, జపాన్ నుంచి ఇవి దిగుమతి అవుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ట్రెండ్‌పై ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో గేమింగ్ కోర్సుల్లో నైపుణ్యం పొందినవారికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ప్యాకేజీలు అందిస్తున్నాయి.
– ప్రదీప్తి, ఐటీ నిపుణులు
గేమింగ్కుఇమేజ్ టవర్స్
టీ హబ్, టీవర్క్స్ సమీపంలో ఇమేజ్ టవర్స్ రాబోతుంది. అది గేమింగ్ ఇన్నోవేషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌తో పాటు ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ల ప్రకారం ఇప్పటి వరకు ఆవిష్కరణలకు తెలంగాణ దిక్సూచిగా ఎలా నిలిచిందో అదే విధంగా గేమింగ్‌లో కూడా తెలంగాణ సత్తా చాటుతుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి చాలా గొప్పది.
– సందీప్ కుమార్ మక్తాలా, ఐటీ నిపుణులు. ప్రెసిడెంట్, టీటా
వీఆర్ ప్లేయర్స్‌కు గుర్తింపు
వీఆర్ గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా మాల్స్ల్లో ఉండే గేమ్స్ జోన్స్‌కు స్నేహితులతో వెళ్లి సరదాగా గడుపుతాం. రేస్ కార్, జురాసిక్ ఎస్కేప్, ఎక్స్2 రేసింగ్, వెర్టిగో, వెల్కాన్ గన్, ఆర్ట్ ఆఫ్ అటాక్, జోంబియె సర్వైవల్, ఇంజినీరియం తదితర ఆటలు ఆడుతాం. నిమిషాల కొద్ది ధరలు చెల్లించాల్సి ఉంటుంది. వీఆర్ గేమింగ్‌లో కూడా వరల్డ్ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ఆట బాగా ఆడితే నెంబర్ వన్ ప్లేయర్‌గా ప్రపంచానికి పరిచయం కావొచ్చు.
– కార్తీక్, వీఆర్ గేమర్, సికింద్రాబాద్