సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధస్సు( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బుధవారం నగరంలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం(కోఠి ఉమెన్స్ కాలేజ్)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విద్యార్థులకు,అధ్యాపకులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని విస్తృత్తంగా వినియోగిస్తున్నారని, దీని ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించిన ఐ-రాస్తే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఈవిషయాన్ని సూచించారు. దానికి అనుగుణంగానే ‘ఏ ఐ ఫర్ ఆల్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయ తెలిపారు. అనంతరం విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ.. విద్యా విధానంలో కొత్తగా వస్తున్న మార్పులను బోధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.