సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): లైసెన్స్ తుపాకీతో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఫైరింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పంజాగుట్ట పోలీసు కానిస్టేబుల్ సాయికుమార్, హోంగార్డు రవిబాబు అతడిని నిలువరించారు. అతడి చేతిలో ఉన్న గన్ను స్వాధీనం చేసుకొని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. సమయస్ఫూర్తి, చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని సీపీ సీవీ ఆనంద్ తన కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. ఒకొక్కరికీ రూ. 2,500 నగదు పారితోషకంతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. వివరాలిలా ఉన్నాయి.. అమీర్‌పేటలోని శబరినాథ్ లైన్లో బుధవారం తెల్లవారు జామున సాయికుమార్, రవీంద్రబాబు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వెంకట నాగేందర్‌రెడ్డి అనే వ్యక్తి ఇద్దరు ట్రాన్స్జెండర్లతో గొడవ పడుతున్నాడు. గమనించిన వీరిద్దరు అక్కడకు వెళ్లి వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వెంకట నాగేందర్‌రెడ్డి కోపోద్రిక్తుడై తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ను తీసి పోలీసులను కాల్చేందుకు ప్రయత్నించాడు. సమయస్ఫూర్తిగా వ్యవహరించిన పోలీసులు, ఆయుధంతో ఉన్న వెంకట నాగేందర్‌రెడ్డిని అడ్డుకొని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.