సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): నగర జీవనశైలిలో వేగంగా మార్పులు వస్తున్నాయి. గతంలో వారాంతాల్లోనే ఎక్కువగా బయట ఆరగించడానికి ఇష్టపడేవారు. నెలలో ఒకటి రెండు వారాలు అని పరిమితి పెట్టుకునే వారు. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడే కొత్త రుచులకు సై అంటున్నారు. ఆదాయాలు పెరగడం, ఇంట్లో చేసుకునే తిరిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులకు, స్నేహితులతో కలిసి విందు ఆరగిస్తున్నారు. చలికాలం కాలం కావడంతో వేడి వేడి రుచులకు నగరవాసులు ఫిదా అవుతున్నారు. అందులోనూ గ్రిల్ వంటకాలపై మనసు పారేసుకుంటున్నారు. దగ్గరుండి గ్రిల్‌పై వేడి చేయించుకుని మరీ ఆరగిస్తున్నారు. చికెన్, మటన్, చేపలతో పాటు శాఖహారంలోనూ గ్రిల్‌పై చేసిన వంటకాలను అత్యధిక శాతం మంది ఇష్టపడుతున్నారు. అంతేకాదు సౌత్, నార్త్, చైనీస్, ఇటాలియన్, అమెరికన్, ఓరియంటల్, ఏషియన్, ఇలా భిన్న రుచులల్లో కూడా గ్రిల్ వంటకాలే ఇష్టపడుతున్నారని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలీ ప్రాంతాల్లోనే రెస్టారెంట్లు, హోటళ్లు గ్రిల్ వంటకాలను ప్రత్యేకంగా అందిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో తార్నాక, ఈసీఐఎల్, ఉప్పల్, ఎల్బీనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల్లోనూ గ్రిల్ వంటకాలను ఆరగిస్తున్నారు. వీటిపై సోయా చిల్లి చంక్స్, బేబికార్న్, స్వీట్ పోటాటో టోస్టెడ్ మష్రూం, ప్రాన్స్, గ్రిల్డ్ ఫిష్, చికెటా మసాలా కుల్చా తదితరాలను స్వయంగా గ్రిల్ చేసుకుని ఇష్టంగా ఆరగిస్తున్నారు. నగరంలో ఇటీవల కాలంలో బాగా విస్తరిస్తున్నది ఈ ట్రెండ్. మాంసాహార ప్రియులకు మటన్, కడక్ సీక్, చిల్లీ గార్లిక్ రొయ్లు, ఫిష్ టిక్కా, ముర్గ్ బోటీ, కబాబ్ చికెన్‌తో పాటు మరెన్నో రుచులు ఉన్నాయి. శాకాహారులకు రుచినిచ్చే పైనాపిల్ చాట్, బేబి పొటాటో, ఫన్నీర్ టిక్కా వంటి వీ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.