హిమాయత్‌నగర్,నవంబర్7: రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ముదిరాజ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.1000 కోట్ల నిధులను కేటాయించాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, మహాసభ ఆవిర్భావం సందర్భంగా పల్లెపల్లెకు ముదిరాజ్ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపు నిచ్చారు.సోమవారం హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజు ముదిరాజ్ కులస్తులను బీసీ(డీ) నుంచి బీసీ (ఏ)కు మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపతి, సలహాదారుడు రవీందర్, ప్రొఫెసర్ రాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి, ఉపాధ్యక్షుడు మాణిక్యం, యువజన విభాగం శ్రీనివాస్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్, కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.