సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య బీమా కింద పాలసీదారు చికిత్సకైన ఖర్చును చెల్లించాల్సిందేనని స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ తేల్చి చెప్పింది. ఫిర్యాదుదారు భర్త వైద్య ఖర్చుల కోసం అయిన రూ.6 లక్షలు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ ఆదేశించింది.
రామచంద్రాపురంలోని బీరంగూడకు చెందిన కాటెపల్లి శ్రీలత గృహిణి. స్టార్హెల్త్ బీమా కంపెనీ నుంచి ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్నారు. భర్త అనారోగ్యానికి గురికావడంతో కిమ్స్ దవాఖానలో కాలేయ మార్పిడి చికిత్స జరిగింది. దీంతో చికిత్సకు అయిన ఖర్చులు రూ.6లక్షలు చెల్లించాల్సిందిగా అన్ని ధ్రువీకరణపత్రాలతో కంపెనీ ప్రతినిధులను ఆశ్రయించారు. వారు నిర్లక్ష్యం ప్రదర్శించారు.
ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మొండిగా వ్యవహరించారు. దీంతో కంపెనీ నిర్లక్ష్యం, సేవలపై బాధితురాలు వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు ముందుగా చెప్పలేదని, అందుకు బీమా డబ్బులు చెల్లించలేమని కమిషన్కు విజ్ఞప్తి చేశారు. దీంతో అన్ని పత్రాలను పరిశీలించిన కమిషన్.. ఆరోగ్యబీమా కింద వర్తించే నిబంధనల ప్రకారమే చికిత్స జరిగిందని వైద్య ఖర్చులు రూ.6లక్షలు చెల్లించాల్సిందేనని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 పేర్కొన్నది. దీంతోపాటు మానసికంగా వేదనకు గురైనందున రూ.10వేల నష్టపరిహారం చెల్లించాలని, రూ.5వేలు కేసు ఖర్చుల కింద అందజేయాలని స్టార్ హెల్త్ కంపెనీకి సూచించింది.